
Indiramma Houses : హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పేదలు, మధ్యతరగతి వర్గాల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ (CURE) పరిధిలోని ఇల్లు, స్థలం లేని పేదల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల (LIG ఫ్లాట్ల) పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సచివాలయంలో సోమవారం నాడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, LIG ఇళ్ల బ్రోచర్‌లు, వాట్సాప్ దరఖాస్తు సేవలను ఆవిష్కరించారు.
Also Read : పార్టీ మార్పు విషయంలో బిగ్ ట్విస్ట్… BRSలోనే కొనసాగుతానన్న మల్లారెడ్డి
📢 ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు.. పూర్తి వివరాలు ఇవే
🔸 హైదరాబాద్ CURE ప్రాంతంలో 528 చదరపు అడుగుల ఫ్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించగా, భూమి ఉచితంగా ఇవ్వనుంది.
🔸 మీ సేవ లేదా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100,… pic.twitter.com/4yXcPJY3GR
— ముచ్చట్లు (@muchatlu_) July 20, 2026
ఈ సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. CURE పరిధిలోని అర్హులైన పేదలు రూ. 10,000 టోకెన్ రుసుము చెల్లించి ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనిసూచించారు. రేపటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ ప్రత్యేక వెబ్‌సైట్,వాట్సాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. పూర్తిగా డ్రా పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఒకవేళ డ్రాలో ఇల్లు రాని పక్షంలో వారు చెల్లించిన రూ. 10,000 టోకెన్ మొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని కఠినమైన నిబంధనలను విధించారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ఎంపికైన లబ్ధిదారుల పేరిటే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు, నిర్మాణానికి రూ. 5 లక్షల సహాయం/సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. అయితే, కేటాయించిన ఫ్లాట్లను పదేళ్ల పాటు ఇతరులకు అమ్మడం గానీ, లేదా అద్దెకు ఇవ్వడం గానీ చేయకూడదనే ప్రధాన షరతు విధించారు. లాభాపేక్ష, స్వార్థం లేకుండా నిజమైన పేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల సామాన్యులు కనీసం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి కాస్ట్లీ ఏరియాల్లో కూడా అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలు ఉన్నారు. అందుకే CURE పరిధిలోని మొదటి దశలో 16 నియోజకవర్గాలలో 528 చదరపు అడుగుల వైశాల్యంతో గ్రౌండ్ ప్లస్ 3 (G+3) అంతస్తుల మోడర్న్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతలో 7,680 ఫ్లాట్లను నిర్మిస్తుండగా, భవిష్యత్తులో మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల వల్ల అప్పుడు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పేదలకు ఉపయోగపడకుండా పోయాయని పొంగులేటి విమర్శించారు. నగరానికి 35 కిలోమీటర్ల సుదూర ప్రాంతాల్లో నిర్మించడం వల్ల ఉపాధి, రవాణా సౌకర్యాలు లేక పేదలు అక్కడ నివసించేందుకు ఆసక్తి చూపలేదని చెప్పారు. దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం చదరపు గజం లక్షల రూపాయిల విలువ చేసే కోర్ సిటీ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూముల్లోనే టవర్లు నిర్మించి పేదలకు ఉచితంగా ఇస్తోందని స్పష్టం చేశారు.
Also Read : బహదూర్‌గూడ భూముల వివాదంలో ప్రభుత్వానికి షాక్.. తెలంగాణ హైకోర్టు స్టే ఉత్తర్వులు!
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “గుడిసెలు లేని తెలంగాణ” నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం LIG ఇళ్లు, హౌసింగ్ బోర్డు కాలనీలు నిర్మించి పేదలకు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంత విలువైన భూమి అయినా పేదల సంక్షేమం కోసమే వినియోగిస్తామని, ఈ ఇళ్ల కేటాయింపుల్లో అన్ని వర్గాలకు సరైన రిజర్వేషన్లు అమలు చేస్తూ పూర్తి పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హౌసింగ్ విభాగ్యాన్నే పూర్తిగా రద్దు చేసిందని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరించి పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల శుభసమయంలో CURE ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని, మళ్లీ వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందజేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు సొంత స్థలాలు ఉన్న పేదలకు గ్రామాల్లో 100 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ రెండు విడతల్లో ఏకంగా 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటికే దాదాపు 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు కూడా జరిగాయి. పల్లెల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించి విజయవంతంగా అమలు చేయడంతో, ఇప్పుడు అదే స్ఫూర్తితో పట్టణ, సిటీ ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే (అంటే 2027 మార్చి నాటికి) పట్టణ ప్రాంతాల్లో ఏకంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ప్రతి పట్టణ నియోజకవర్గానికి 500 నుండి 1000 ఇళ్లను కేటాయిస్తున్నారు. నగరం మధ్యలోనే నివాసం ఉండటం వల్ల పేదలు సులభంగా తమ దినసరి పనులకు, ఉద్యోగాలకు వెళ్లడానికి వీలవుతుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకపోవడమే ఈ అర్బన్ హౌసింగ్ ప్లాన్‌కు లభిస్తున్న అతిపెద్ద అనుకూలత.
రాజకీయంగా కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీని సరిగ్గా నిలబెట్టుకోకపోవడం వల్ల ప్రజల్లో వచ్చిన అసంతృప్తినే కాంగ్రెస్ పాఠంగా మార్చుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి నగరాల్లోని పేదల సొంత ఇంటి కలను నెరవేర్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, ఈ వేగవంతమైన పురోగతి ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు రాజకీయంగా పెద్ద మైనస్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
16 నియోజకవర్గాల జాబితా, దరఖాస్తు పూర్తి వివరాలు!
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ (CURE) పరిధిలోని నిరుపేదలు, స్థలం లేని వారి కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ (LIG ఫ్లాట్లు) పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, అర్హతలు, నియోజకవర్గాల జాబితాను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆరు గ్యారెంటీలలో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా సిటీలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా ఉపాధి పొందుతున్న పేదలకు ఉచితంగా సొంత ఇంటి కల నెరవేరనుంది.
ఈ పథకం కింద ఈనెల 21వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన ప్రజలు మీసేవ కేంద్రాలు, అధికారిక వెబ్‌సైట్, వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఆర్థిక వివరాలు , సబ్సిడీ విధానం
మొత్తం నిర్మాణ వ్యయం: ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 11 లక్షల వరకు ఖర్చు కానుంది.
ప్రభుత్వ సబ్సిడీ: ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి రూ. 5 లక్షలను ఉచితంగా సబ్సిడీగా అందిస్తారు.
లబ్ధిదారుని వాటా: మిగిలిన రూ. 6 లక్షల మొత్తాన్ని లబ్ధిదారుల నుంచి నాలుగు వాయిదాల్లో (Installments) వసూలు చేస్తారు.
టోకెన్ అమౌంట్: దరఖాస్తు సమయంలో రూ. 10,000 టోకెన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ డ్రాలో ఇల్లు మంజూరు కాకపోతే, ఈ రూ. 10,000 మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఒకవేళ ఇల్లు మంజూరైతే, లబ్ధిదారుడు చెల్లించాల్సిన రూ. 6 లక్షల వాటాలో ఈ రూ. 10,000ను మినహాయిస్తారు.
అర్హతలు ,ఎంపిక ప్రక్రియ
ఆదాయ పరిమితి: లబ్ధిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల వరకు ఉండవచ్చు.
స్వంత ఇల్లు ఉండకూడదు: దరఖాస్తుదారుని పేరిట CURE పరిధిలో ఎలాంటి స్థలం గానీ, సొంత ఇల్లు గానీ ఉండకూడదు.
ఒక్క దరఖాస్తు మాత్రమే: ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే స్వీకరించబడుతుంది.
స్థానికత నిబంధన: ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరిశీలన (Scrutiny): దరఖాస్తులను 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా వడపోస్తారు. అర్హులైన దరఖాస్తుదారులు ఎక్కువగా ఉంటే అందరి సమక్షంలో బహిరంగంగా లాటరీ (డ్రా) తీసి ఇళ్లను కేటాయిస్తారు.
ఇంటి విస్తీర్ణం: ప్రతిపాదిత 525 చదరపు అడుగుల ఫ్లాట్‌లో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్ నిర్మిస్తారు.
16 నియోజకవర్గాలు – ఇళ్ల నిర్మాణ ప్రాంతాల జాబితా:
రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి మొదటి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థలాలను ఎంపిక చేశారు:
రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి
మహేశ్వరం: జల్‌పల్లి
శేరిలింగంపల్లి: రాయదుర్గం
ఇబ్రహీంపట్నం: తట్టిఅన్నారం, బండ్లగూడ
మల్కాజిగిరి: కౌకూర్
నాంపల్లి: రెడ్‌హిల్స్ , నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్
ఖైరతాబాద్: హకీంపేట్ దర్గా , జూబ్లీహిల్స్ (ఎమ్మెల్యే కాలనీ)
కార్వాన్: కుల్సుంపురా సమీప పోలీస్ క్వార్టర్స్
బహదూర్‌పురా: నందిముసలిగూడ
అంబర్‌పేట్: సిటీ పోలీస్ లైన్స్
కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ కాలనీ (KPHB)
మేడ్చల్: పోచారం ఎల్‌ఐజీ కాలనీ
కుత్బుల్లాపూర్: గాజులరామారం
సనత్‌నగర్: పాటిగడ్డ
సికింద్రాబాద్ కంటోన్మెంట్: మారేడ్‌పల్లి – మహేంద్రహిల్స్
మలక్‌పేట్: గడ్డిఅన్నారం (R&B క్వార్టర్స్)
వచ్చే బోనాల నాటికి గృహప్రవేశాలు!
ప్రస్తుతం నగరంలో జరుపుకుంటున్న బోనాల జాతర శుభసందర్భంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వచ్చే ఏడాది బోనాల నాటికి పేదలు ఈ కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమం విషయంలో రాజీపడబోమని, నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపులు జరుపుతున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
అంతేకాకుండా, కేవలం పేదల గురించే కాకుండా మధ్యతరగతి ప్రజల గృహ అవసరాల గురించి కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని, త్వరలోనే మధ్యతరగతి వర్గాలకు కూడా ఒక మంచి శుభవార్త అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,మంత్రి అజారుద్దీన్ ఈ పథకాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.









