Malla Reddy: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఏ ఇతర రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచనలో లేనని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఇకముందు కూడా బీఆర్ఎస్ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేస్తూ, తనపై వస్తున్న అసత్య ప్రచారాలను కేడర్ ఎవరూ నమ్మవద్దని సూచించారు.

మల్లారెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ, ఇటీవల ఘట్‌కేసర్‌లో జరిగిన అందెశ్రీ స్మృతి వనం భూమిపూజ కార్యక్రమం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ ప్రభుత్వ వేదికపై మల్లారెడ్డి ఆసీనులయ్యారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇతర గులాబీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, అధినేతపై విమర్శలు జరుగుతున్నా వేదికపై ఉన్న మల్లారెడ్డి మౌనంగా ఉండటం, కనీసం నిరసన తెలపకపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

ఇటీవలి కాలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. ఇటీవల సరూర్ నగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన కీలకమైన ‘యువ సంగ్రామ సదస్సు’కు హాజరుకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమానికి మల్లారెడ్డి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, ఆయన తన సోషల్ మీడియా ఖాతాలలోనూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రోజువారీ అప్‌డేట్స్ ఇవ్వడం నిలిపివేయడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

Also Read : మేము రిలేషన్ లో ఉన్నాం.. ఉదయ్ కృష్ణారెడ్డి షాకింగ్ సూసైడ్ నోట్!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన విద్యాసంస్థలు, వ్యాపార కార్యకలాపాలపై అధికారులు నిఘా పెంచారని, వివిధ తనిఖీలు, అనుమతుల నిలిపివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాల వల్ల తమ వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకునేందుకే కొద్దిరోజులు రాజకీయంగా సైలెంట్‌గా ఉంటామని, తమ వ్యాపారాలను కాపాడుకోవడం ముఖ్యమని మల్లారెడ్డి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం మారిన కొత్తలో మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్‌తో సఖ్యత పెంచుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, గతంలో రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన తీవ్ర విమర్శల దృష్ట్యా కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జాతీయ పార్టీ అయిన బీజేపీ వైపు మల్లారెడ్డి కుటుంబం దృష్టి సారించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి  బీజేపీ కార్యాలయ వర్గాలను కలవడం, సంప్రదింపులు జరపడం ఈ చేరిక ప్రచారానికి ప్రధాన ఊతాన్నిచ్చింది.

మల్లారెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా పలువురు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా నాయకుల అంతర్గత సమావేశాల్లోనూ పార్టీ ముఖ్య నేతలు మల్లారెడ్డి తీరుపై స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు సమాచారం. “వారు తమ వ్యాపారాల కోసం దూరంగా ఉండాలని అనుకుంటే వారిని వదిలేయండి, పార్టీ సమావేశాలకు వారిని ఇకపై ప్రత్యేకంగా ఆహ్వానించవద్దు” అని కేడర్‌కు దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, శ్రావణమాసం నుంచి తెలంగాణలో బీజేపీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతల చేరికలు ఉంటాయని ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ అభయ్ పాటిల్ ప్రకటించడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమని, ఇందుకోసం సన్నాహాలు కూడా పూర్తయ్యాయని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొనసాగుతున్న ఉత్కంఠ
తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయన ప్రవర్తన, ప్రభుత్వ సభల్లో ప్రత్యక్షమవ్వడం, సొంత పార్టీ సదస్సులకు గైర్హాజరు కావడం వంటి పరిణామాలు గులాబీ శ్రేణుల్లో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. మల్లారెడ్డి నిజంగానే బీఆర్ఎస్‌లో కొనసాగుతారా లేక అనుకూల సమయం చూసుకుని కమలం గూటికి చేరుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Also Read : జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో జలమయమైన జిల్లాలూ.. నలుగురు మృతి

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.