
Heavy Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురిసిన వానలకు రోడ్లు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా విజయవాడలో భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 24 గంటల్లోనూ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
విజయవాడలో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కురిసిన వానతో రోడ్లపైకి నీరు చేరింది. బస్టాండ్ సమీపంలోని బ్రిడ్జి వద్ద వర్షపు నీటిలో ఆర్టీసీ బస్సు మునిగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : ఏకపక్ష సుంకాలపై బ్రిక్స్ ఆందోళన.. ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగుల దగ్గర నిలబడవద్దని అధికారులు సూచించారు. వర్షం, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని తెలిపారు.
Also Read : నిరుద్యోగులకు మంత్రి ఉత్తమ్ బంపరాఫర్.. 250 కంపెనీల్లో 3 వేల జాబ్స్.. వివరాలివే!









