World in flux, Putin and Xi likely to be in New Delhi for Brics Summit
World in flux, Putin and Xi likely to be in New Delhi for Brics Summit

BRICS Declaration : ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌ కూటమి సమావేశాల్లో ఢిల్లీ డిక్లరేషన్‌ ను బ్రిక్స్‌ దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు సదస్సు అధ్యక్షుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సభ్యదేశాల మధ్య విభేదాలు పక్కన పెట్టి ఇరాన్‌ సహా యూఏఈ, సౌదీ అరేబియా కూడా ఈ డిక్లరేషన్‌కు ఆమోదం తెలపడం విశేషం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ భారత్‌ దౌత్య నైపుణ్యంతో ఈ విషయంలో అన్ని సభ్య దేశాలు ఏకతాటిపైకి రావడం గమనార్హం.

ఈ సందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష సుంకాల విధింపుపై బ్రిక్స్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న ఏకపక్ష నిర్బంధ చర్యలను అన్ని దేశాలు సంయుక్తంగా ఖండించాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. ప్రపంచ దేశాల్లో అణ్వాయుధ, సంఘర్షణల ముప్పును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై బ్రిక్స్‌ దేశాల కూటమి చర్చించింది. అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో సహకారం అందించుకోవాలని సమావేశం పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు సభ్యదేశాలు తెలిపాయి. ఈ సందర్భంగా తీవ్రవాద కార్యకలాపాలను బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అరికట్టాలని సమావేశం ఆమోదించింది. గతేడాది జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్‌ కూటమి నేతలు ఖండించారు. కాగా సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాద చర్యలను ఖండించిన నేతలు.. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని సమావేశం కోరింది.

ఈ సందర్భంగా బ్రిక్స్ సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ కు కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్న పశ్చిమాసియా సంక్షోభంపైనా సభ్య దేశాల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం కుదిరింది. పశ్చిమాసియా యుద్ధంపై బ్రిక్స్ కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏ రకమైన సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని సమావేశం స్పష్టం చేసింది. శాంతిని నెలకొల్పడానికి నిరంతర చర్చలు, దౌత్య మార్గాలే ఏకైక పరిష్కారమని సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి.

‘న్యూఢిల్లీ డిక్లరేషన్’లోని ముఖ్యాంశాలు

1. పశ్చిమాసియా సంక్షోభంతో పాటు ఎలాంటి అంతర్జాతీయ సమస్యలకైనా యుద్ధం పరిష్కారం కాదని, దౌత్య మార్గాలు, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్ధ చర్యలను ఖండిస్తూ నిర్ణయం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

2. మారుతున్న, వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సభ్యదేశాలు డిమాండ్ చేశారు.

3. భారత్ నేతృత్వంలో ఈ సదస్సు మానవాభివృద్ధే ప్రథమం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని సమావేశంలో తీర్మానించారు.

4. ప్రపంచ సరఫరా వ్యవస్థలను బలపరచడం, ఆహార-ఇంధన భద్రత, స్థానిక కరెన్సీల ద్వారా వ్యాపారాన్ని పెంపొందించడం వంటి ఆర్థిక అంశాలపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

కాగా బ్రిక్స్‌ సదస్సును ఉద్దేశించి సదస్సు అధ్యక్షుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ కూటమి ప్రయాణంలో ఇది కీలక ఘట్టమని పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమి ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్య దేశాల ప్రజలకు విశ్వాసం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొ్న్నారు.

అంతర్జాతీయ వేదికలపై ఎదురవుతున్న వివిధ సమస్యలు, సవాళ్లకు బ్రిక్స్ దేశాలు ముందుండి కార్యాచరణ ద్వారా పరిష్కారం చూపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి మరింత వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూనే, మనం వేసే ప్రతి అడుగులో మానవాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని భారత ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం లభించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ కూటమి ఏకతాటిపై నిలిచిందని, ప్రపంచ శాంతి, అభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తోందని స్పష్టమవుతోందని మోదీ అన్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.