సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 19న భారీ మెగా జాబ్ మేళా జరగనుంది. కోదాడలోని సీ.సీ.రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహలతో పాటు సింగరేణి, పరిశ్రమల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ మెగా జాబ్ మేళా ద్వారా సుమారు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలలో దాదాపు 3,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఒక్క ఉద్యోగం యువత జీవితాన్నే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తును మారుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యువత ప్రతిభకు, నైపుణ్యానికి తగిన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.

Also Read : ప్రైవేట్‌ హాస్టళ్ల పై హైడ్రా నజర్‌… ఇక మీదట అవి లేకుంటే అంతే సంగతులు..

గతేడాది హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళా అపూర్వ విజయాన్ని సాధించింది. ఆ జాబ్‌మేళాకు దాదాపు 40 వేల మంది నమోదు చేసుకోగా.. 20,463 మంది అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అదే స్ఫూర్తితో ఈసారి కోదాడలో మరింత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కోదాడ జాబ్‌మేళా యువత కలలకు కొలువు దారిగా మారాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించి ఈ మేళాకు పంపాలని కోరారు.

ఈ జాబ్ మేళా కేవలం కోదాడ ప్రాంతానికే కాకుండా సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు కూడా ఎంతో మేలు చేకూర్చనుంది. ఈ సమాచారం ప్రతీ గ్రామానికి అర్హులైన ప్రతి అభ్యర్థికి చేరేలా సోషల్ మీడియా, ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థుల పేర్ల నమోదు కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్లు, వేచి ఉండేందుకు షెడ్లు, పార్కింగ్, తాగునీరు, హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. ఉద్యోగ వేటలో ఉన్న యువతీ యువకులు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ ‌తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.