
Crime News : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఎమ్మెల్యే పీఏ ఉదాంతం రాష్ర్టంలో కలకలం రేపుతోంది. తమ ఎమ్మె్ల్యేకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పించిందని నమ్మించి సదరు పీఏ కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే భద్రాచలం కొత్తగూడెం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకొని పరారయ్యాడు. డబ్బులు తీసుకుని ఇదిగో అదిగో అంటూ నమ్మిస్తున్న అతనిమీద అనుమానం వచ్చిన బాధితులు నిలదీయటంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పీఏ రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో పలువురు బాధితులు పోలీసులు.. ఎమ్మెల్యేను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సదరు పీఏ ఉద్యోగాల పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొల్లగొట్టిన మొత్తం రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు డబ్బులిచ్చిన బాధితులు ఏపీలోనూ ఉన్నట్లు తేలడంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చినందున ప్రభుత్వం ఈయనకు ప్రత్యేక అవకాశాలు కల్పించిందని సదరు పీఏ నిరుద్యోగులతో చెప్పి నమ్మించినట్లు తెలిసింది. అలా మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం వంటి చోట్ల ఎమ్మెల్యేతో చెప్పి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పీఏ నమ్మించి వసూలు చేశాడు.
Also Read : హైదరాబాద్ లో కొత్త రకం సైబర్ ఫ్రాడ్.. మీ ఫోన్లు జాగ్రత్త.. సజ్జనార్ వార్నింగ్!
కాగా, డబ్బులు ఇచ్చిన వారిలో కేవలం నిరుద్యోగులే కాకుండా ఉద్యోగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల పైనే తీసుకున్నాడని తెలిసింది. ఓ ఆటో డ్రైవర్ తన బంధువు కోసం రూ.10 లక్షలు, ఓముఖ్యమైన వ్యక్తి టెక్నికల్ ఇంజినీరు పోస్టు కోసం రూ.30 లక్షలు, గ్రామ పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఓ మహిళ వద్ద రూ.10 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆమె ఎమ్మెల్యేతో చెబుతానని వార్నింగ్ ఇవ్వగా కొంత తిరిగి ఇచ్చాడని తెలిసింది. తానుండే మణుగూరు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు తన అత్తవారిల్లు ఉన్న శ్రీకాకుళంలోనూ ఉద్యోగాల పేరిట ఆ పీఏ పెద్ద ఎత్తున దోచుకున్నట్లు తెలుస్తోంది. అయితే గడచిన రెండేళ్లుగా ఈ దందా జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే దృష్టికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితులు అనుమానిస్తున్నారు.
పోలీసులు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు: ఎమ్మెల్యే
కాగా, పీఏ పరారీ తర్వాత బాధితులు ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావును కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు తనను కలిశారని.. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించానని వారు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు వెల్లడించారు. తన పీఏను సరెండర్ చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.. ఉద్యోగాల కోసం ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు. కాగా, డీఎస్పీ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ..కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.
Also Read : నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు సూసైడ్..









