Crime News : గతంలో ప్రియుడి మోజులో పడి కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రులను హత్య చేసిన యువతి నేడు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జనవరిలో వికారాబాద్ జిల్లా బంట్వారం (మం)యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా మూడో కుమార్తె సురేఖ(25)కు మినహా అందరికీ పెళ్లిళ్లయ్యాయి.

ఇలా ఉండగా సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. ఈ క్రమంలోనే ఆమెకు ఏడాది కిందట సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలానికి చెందిన ఓ యువకుడు(డ్రైవరు) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఆ యువకున్ని పెళ్లి చేసుకోవాలనుకున్న సురేఖ ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. మరోకరితో పెళ్లి చేయడం కోసం పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీంతో వారి ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను హతమార్చాలని సురేఖ పథకం పన్నింది. నర్సుగా పనిచేస్తుండటంతో ఇంజెక్షన్‌ల పై ఉన్న అవగాహనతో మత్తు ఇంజెక్షన్‌లను తీసుకువచ్చి వారికి ఇచ్చింది. ఆ ప్రభావంతో వారు మృతి చెందారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినట్టు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో సురేఖనే వారిని చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

కొద్ది రోజుల కిత్రం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నాడు తల్లిదండ్రులను చంపినట్లుగానే ఆమె కూడా మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కాగా చనిపోయే ముందు నా చావుకు కారణం ఎవరు కాదంటూ సురేఖ రాసిన సూసైడ్ నోట్ లభించింది. కాగా, ఆమె డెడ్‌బాడీని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సురేఖ మృతదేహం అక్కడి మార్చూరీలో ఉంది. తల్లిదండ్రులను హత్య చేయడంతో సురేఖ మృతిని కుటుంబసభ్యులు పట్టించుకోవడం లేదు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే కుటుంబ సభ్యులను సంగారెడ్డికి రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వారు మృతదేహాన్ని తీసుకువెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.