
Gujarat : గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలో వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అక్కడి ఒక రైతు పొలంలో ఉన్న 18 అడుగుల లోతు గల బావిలోని నీళ్లు ఆగస్టు 2వ తేదీ నుంచి దానంతట అవే సముద్రపు అలల మాదిరిగా ఎగిసిపడుతున్నాయి. కొన్నిసార్లు ఈ నీళ్లు బావి పైవరకు వచ్చి బయటకు కూడా పడుతున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, హైవేపై వెళ్లే ప్రయాణికులు ఈ వింతను చూడటానికి భారీగా తరలివస్తున్నారు.
Also Read : సీఎం విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. సంగీత సంచలనం!
సమీపంలో ఉన్న ఇతర బావుల్లో నీరు ప్రశాంతంగా నిశ్చలంగా ఉండగా, కేవలం మూడు నెలల క్రితమే తవ్విన ఈ కొత్త బావిలోనే నీళ్లు అలా ఊగడం చూసి స్థానికులు మొదట భయాందోళన చెందారు. ఇది ఏమైనా రాబోయే భూకంపానికి సంకేతమా లేదంటే ఇదేమైనా దైవకశక్తినా అని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు, జియాలజిస్టులు స్పందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు మళ్లీ వేగంగా నిండుతున్నాయి.
భూమి లోపలి రాతి పొరల్లో చిక్కుకుపోయిన గాలి, నీటి ఒత్తిడి వల్ల బావి రంధ్రాల గుండా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీటిలో ఇలాంటి అలలు వస్తున్నాయని జిల్లా జియాలజిస్ట్ జె.ఎస్. వాధేర్ వివరించారు. బావి ప్రధాన రహదారి పక్కనే ఉండటం, గాలి వేగంగా వీచడం కూడా నీటి కదలికలకు మరొక కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు..
మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖారే మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత శాస్త్రీయ అధ్యయనం చేయడానికి గాంధీనగర్ నుంచి నిపుణుల బృందం గ్రామానికి రానుంది.
Also Read : నేషనల్ హ్యాండ్‌లూమ్ డే: ప్రధాని మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం గిఫ్ట్!









