
CM Vijay: అవినీతి విషయంలో తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన చేశారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే మంత్రినైనా సరే వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అవినీతికి సంబంధించి తమ ప్రభుత్వ విధానం చాలా కఠినంగా ఉంటుందని సీఎం విజయ్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినా లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. వారి పదవి లేదా పలుకుబడితో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పదవుల్లో ఉన్న వారు ఆదర్శంగా ఉండాలని, నైతిక విలువలతో కూడిన పాలన అందించడమే తమ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఎవరైనా సరే, తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read : స్విగ్గీ ఇన్స్టామార్ట్ వినూత్న ప్రయోగం: ఇకపై 10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్!
అంతేకాకుండా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రుల ప్రవర్తనపై కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలను సందర్శించేటప్పుడు అధికారులు, మంత్రులు రీల్స్ చేయడం లేదా వీడియోలు తీయడం వంటి పనులు చేయవద్దని ఆయన సూచించారు. ఇలాంటి పనులు అధికారిక బాధ్యతలను చిన్నచూపు చూసినట్లు అవుతాయని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారం కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని, మంత్రులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ఈ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్ అంశాలపై చర్చించారు. ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్లలో ఏయే అంశాలు, పథకాలు చేర్చాలనే దానిపై మంత్రులతో ఆయన సలహాలు తీసుకున్నారు. టీవీకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో, దీనిపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను ఈ బడ్జెట్లో పొందుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : ముడతలు మాయం.. చర్మం మెరిసిపోవడం ఖాయం!: ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా చేసేయండి..!









