
Gas cylinder : దేశీయ క్విక్ కామర్స్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల డెలివరీలకే పరిమితమైన క్విక్ కామర్స్ సేవలు ఇప్పుడు గృహ అవసరాల వంటి కీలక యుటిలిటీ సేవల్లోకి విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో ప్రముఖ క్విక్ కామర్స్ వేదిక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ చేతులు కలిపింది. దేశంలోనే తొలిసారిగా ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్లను కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్ల ఇళ్లకు చేరవేసేలా ఈ రెండు సంస్థల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకుంటే అది డెలివరీ కావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతోంది. అయితే, ఈ జాప్యాన్ని పూర్తిగా నివారిస్తూ బెంగళూరు నగరంలో బుధవారం (జూలై 15, 2026) నుండి ఈ సరికొత్త సేవలను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ సేవల ద్వారా బెంగళూరు వాసులు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్‌ను ఉపయోగించి ఆర్డర్ చేసిన కేవలం పది నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్‌ను తమ ఇంటి వద్దకే పొందే వీలుంటుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా హెచ్‌పీసీఎల్ సంస్థ కస్టమర్ల కోసం 10 కేజీల బరువుండే ‘హెచ్‌పీ నవ్య’ కాంపోజిట్ సిలిండర్‌తో పాటు 5 కేజీల మెటల్ సిలిండర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఇళ్లలో వాడే స్టీల్ సిలిండర్‌ల కంటే ఈ నవ్య సిలిండర్లు ఎంతో భిన్నమైనవి. వీటిని అత్యాధునిక ‘కాంపోజిట్ పాలిమర్’తో తయారు చేశారు. ఇవి సాధారణ సిలిండర్ల కంటే 50 శాతం తక్కువ బరువు ఉండటమే కాకుండా, వీటికి తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉండదు.
ఈ ‘హెచ్‌పీ నవ్య’ సిలిండర్ల యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి పాక్షిక పారదర్శకత (Transparent Body) కలిగి ఉంటాయి. అంటే సిలిండర్ లోపల ఎంత గ్యాస్ నిల్వ ఉందో బయటి నుండి చూసి సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందే అంచనా వేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లలో నివశించే చిన్న కుటుంబాలు, ఉద్యోగస్థులు , ఒంటరిగా ఉండే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ తేలికపాటి సిలిండర్లను రూపొందించారు.
క్విక్ కామర్స్ వేదిక ద్వారా బుక్ చేసినప్పటికీ, ఈ సిలిండర్ల సరఫరాలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. హెచ్‌పీసీఎల్‌కు చెందిన అధీకృత గ్యాస్ ఏజెన్సీలు, శిక్షణ పొందిన నిపుణులైన సిబ్బంది ద్వారానే వీటిని కస్టమర్లకు డెలివరీ చేయనున్నారు. మొదటిసారి కొత్త కనెక్షన్ లేదా సిలిండర్ కొనుగోలు చేసే వారి వద్ద నుండి నిబంధనల ప్రకారం అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను సేకరించిన తర్వాతే సిలిండర్ కేటాయిస్తారు. ఆ తర్వాతి ఆర్డర్లను రీఫిల్‌గా పరిగణిస్తూ.. డెలివరీ సమయంలో కస్టమర్ల నుంచి ఖాళీ సిలిండర్‌ను తీసుకొని కొత్త సిలిండర్‌ను అందజేస్తారు.
ఎల్‌పీజీ సిలిండర్‌లను అందరికీ సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకే ఈ వినూత్న సేవను తీసుకొచ్చామని హెచ్‌పీసీఎల్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అమిత్ గర్గ్ తెలిపారు. కాగా, వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇన్‌స్టామార్ట్ కట్టుబడి ఉందనడానికి ఈ భాగస్వామ్యమే నిదర్శనమని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోనే అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను ఇతర నగరాలకు ఎప్పుడు విస్తరిస్తారనేది సంస్థలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.









