Vijay Mallya :  తాను కావాలని భారత్‌కు దూరంగా ఉండటం లేదని, ప్రస్తుతం కొన్ని చట్టపరమైన కారణాల వల్ల బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని వ్యాపారవేత్త విజయ్ మాల్యా అన్నారు. ఈ విషయంపై మాల్యా ఎక్స్‌లో వరుసగా పోస్టులు చేశారు. 1992 నుంచి తాను బ్రిటన్‌లో శాశ్వత నివాసిగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు తనకు అనుమతి లేదని తెలిపారు. భారత ప్రభుత్వం తన విషయంలో చాలా అన్యాయంగా వ్యవహరించిందని మాల్యా ఆరోపించారు. భారత్‌కు రావాలని ప్రభుత్వం చెబుతున్నా.. తన పరిస్థితిని కూడా చూడాలని అన్నారు.

కాగా, 2025 అక్టోబర్‌లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఒక విషయం చెప్పారు. ఆర్థిక నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ జాబితాలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే తనను పారిపోయిన వ్యక్తిగా పిలవడంపై మాల్యా అభ్యంతరం తెలిపారు. తాను కావాలని భారత్‌కు రావడం లేదనడం సరికాదని అన్నారు.

Also Read : భర్తలకు షాక్.. పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు జంప్.. నగలు, నగదు కూడా మాయం!

భారత్‌లో కేసులు ఎదుర్కోవాల్సిన వ్యక్తులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గత ఏడాది విదేశాంగ శాఖ కూడా చెప్పింది. ఇందుకోసం కొన్ని దేశాలతో మాట్లాడుతున్నామని, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక వారిని భారత్‌కు తీసుకువచ్చి కోర్టులో విచారణ ఎదుర్కొనేలా చేస్తామని తెలిపింది. మరోవైపు, తన నుంచి బ్యాంకులు ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాయని మాల్యా చెబుతున్నారు. ఈడీ బాంబే హైకోర్టుకు ఇచ్చిన ఒక పత్రంలో తన నుంచి రూ.14,131 కోట్లకు పైగా డబ్బు రికవరీ చేసినట్లు ఉందని ఆయన చెప్పారు.

ఇంత డబ్బు తీసుకున్న తర్వాత కూడా తనను బ్యాంకులను మోసం చేసిన వ్యక్తిగా చూపిస్తున్నారని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో లెక్కలు చూస్తే విషయం అర్థమవుతుందని అన్నారు. తన ఆస్తులను ఈడీ జప్తు చేయడం వల్లే కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు తాను డబ్బులు ఇవ్వలేకపోయానని చెప్పారు. అయితే తన ఆస్తుల నుంచి ఈడీ రూ.350 కోట్లకు పైగా విడుదల చేసి కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు చెల్లించిందని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు గతంలోనే చెప్పాయని మాల్యా అన్నారు. తనపై ఉన్న రూ.6,203 కోట్ల బాకీ కంటే ఎక్కువ డబ్బు ఇప్పటికే తీసుకున్నారని ఆయన వాదించారు.

Also Read : శవాలు ప్రశ్నలు అడుగుతున్నాయి!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.