– RAVI PRAKASH

THE DEAD ARE SPEAKING : అవును… ఈరోజు నేను చాలా బాధపడుతున్నా… ఒక జర్నలిస్టు‌గా మాత్రమే కాదు.ఒక తండ్రిగా చెబుతున్నాను. ఢిల్లీలో ఆరుగురు పిల్లల ప్రాణాలు పోయాయి. ఇది కేవలం భవనం కూలిన కథ మాత్రమే కాదు. ఢిల్లీలో కూలింది కేవలం ఒక భవనం మాత్రమే కాదు. ఒక వ్యవస్థ కూలిపోయింది. ఒక వ్యవస్థ కళ్లముందే కూలిపోయింది. అయితే రాజకీయాలు, ప్రభుత్వం,ఎంసీడీ, జవాబుదారీతనం గురించి మాట్లాడేముందు ఆదిత్య అనే విద్యార్థి శిథిలాల కింద చిక్కుకుని ఎనిమిది సెకన్ల వీడియో చేశారు.తనకు ఎక్కువ సమయం లేదని ఆదిత్యకు తెలుసు. కూలిన భవనం శిథిలాల కింద నలిగిపోతూ తనను కాపాడాలని కోరారు. ఇది ఒక వీడియో మాత్రమే కాదు. ఇది ఒక ఆపద పిలుపు. ఇక మరో విద్యార్థి శిథిలాల కింద చిక్కుకున్నాడు. కొంతమంది బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ల దగ్గర సరైన రక్షణ పరికరాలు లేవు. భారీ యంత్రాలు లేవు. వ్యవస్థ లేదు. కేవలం ఉత్త చేతులు మాత్రమే ఉన్నాయి. కాకపోతే, ఈ అబ్బాయిని బతికించాలి..ఎలాగైనా కాపాడాలనే తెగువ, ఆశ మాత్రం వారిలో కనిపిస్తోన్న దృశ్యాలు మరో వీడియోలో ఉన్నాయి. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆరుగురు. ఆరు మృతదేహాలు. ఆరు కుటుంబాలు. ఆరు భవిష్యత్తులు.

కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ భవనంలో అసలు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది లోపల చిక్కుకున్నారు? ఎంతమంది బయటకు రాలేకపోయారు? ఎందుకంటే ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పే మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అతను చెబుతున్న వివరాలు అధికారులు చెబుతున్న సంఖ్యతో సరిపోలుతున్నాయా? అది సరి చూడాలి. దర్యాప్తు చేయాలి. కానీ ఒక ప్రత్యక్ష సాక్షి క్షేత్ర స్థాయి నుంచి ఒక మాట చెబుతున్నప్పుడు… దాన్నిఅంత సులువుగా నిర్లక్ష్యం చేయలేం. ఎందుకంటే… మృతదేహాలు ప్రశ్నలు అడుగుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఇప్పుడంటే ఇప్పుడే కావాలి. రేపు కాదు ఇక్కడ ఇంకో ప్రత్యక్ష సాక్షి కథనం చూద్దాం. ఈసారి అక్కడే ఉన్న ఒక విద్యార్థి. అతను చేస్తున్న ఆరోపణ ఇంకా తీవ్రంగా ఉంది. పోలీసులు నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఆ విద్యార్థి ఆరోపిస్తున్నాడు. ప్రజలకు చెబుతున్న కథ పూర్తి కథ కాదని అతను అంటున్నాడు. మళ్లీ చెబుతున్నాను. ఇది ఒక ఆరోపణ. ఇది నిజమా కాదా స్వతంత్ర దర్యాప్తు తేల్చాలి. కానీ,ఒక విద్యార్థి తన కళ్లతో ఆ భయాందోళనను చూసిన వ్యక్తి. ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినకుండా ఊరుకోవడమా? లేక, నాన్‌స్టాప్‌ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడమా? ముందు ఆ విద్యార్థి ఏం చెబుతున్నాడో విందాం.

ఇకమొత్తం కథలో బహుశా అత్యంత షాకింగ్ ఆరోపణ. ఒక యువతి ప్రత్యక్ష సాక్షి కథనం. ఆమె చెబుతున్నది ఏంటంటే… ఈ భవనం మీద ఎమ్.సి.డి. హెచ్చరిక బోర్డు ఉందట. భవనం సురక్షితం కాదు అని హెచ్చరిక ఇచ్చారట. ఒక్కసారి ఆలోచించండి. అది నిజమైతే భవనం సురక్షితం కాదు అని తెలుసు. అయినా విద్యార్థులు అక్కడే ఉన్నారు. అయితే ఎందుకు ఖాళీ చేయించలేదు? ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు విద్యార్థులను అక్కడే ఉండనిచ్చారు? ఎవరికి తెలుసు? ఎవరు చూశారు? ఎవరు పట్టించుకోలేదు? ఇవి రాజకీయ ప్రశ్నలు కాదు. ఇవి ప్రాణాలకు సంబంధించిన ప్రశ్నలు. కానీ, ముగింపుకి వెళ్లే ముందు ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెబుతున్నారో ఒక్కసారి చూద్దాం. అన్ని వీడియోలు చూశాం. శిథిలాల కింద నుంచి ఒక విద్యార్థి ‘నన్ను కాపాడండి’ అని అడగడం చూశాం. ప్రాణాలు కాపాడేందుకు సాధారణ ప్రజలు తమ చేతులతో పోరాడటం చూశాం. మృతదేహాలు చూశాం. ప్రత్యక్ష సాక్షుల మాటలు విన్నాం. ఇప్పుడు సానుభూతి గురించి మాట్లాడటం లేదు. సంతాపాన్ని తెలియజేయడం గురించి మాట్లాడాలని లేదు. మనకు కావాల్సింది… జవాబుదారీతనం. ఎందుకంటే, భవనం ఎందుకు కూలింది? అనేది మాత్రమే కాదు. అంతకంటే పెద్ద ప్రశ్న. ఈ భవనం కూలిపోకముందే ఇది సురక్షితంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అన్నదే మా ప్రశ్న. ఢిల్లీలో సంఘటన జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎవరిది? బిజెపిది. ఢిల్లీ ప్రభుత్వం ఎవరిది? బి.జె.పిది. ఎమ్.సి.డి. ఎవరి నియంత్రణలో ఉంది? బి.జె.పి. దయచేసి ఇప్పుడు మాకు నిందల ఆట వద్దు. ఒక విభాగం మీద ఇంకో విభాగం నిందలు వేసుకోవద్దు. ‘ఇది మా బాధ్యత కాదు’ అనే రొటీన్ సమాధానాలు వద్దు. మాకు ఒక్క సమాధానం చెప్పండి. ఎవరు బాధ్యులు? ఈ భవనాన్ని తనిఖీ చేయాల్సింది ఎవరు? చట్టబద్ధమైన హోదా చెక్ చేయాల్సింది ఎవరు? విద్యార్థులు అక్కడ సురక్షితంగా ఉంటున్నారా లేదా చూడాల్సింది ఎవరు? ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? భవనం సురక్షితం కాకపోతే విద్యార్థులు ఎందుకు ఇంకా అక్కడే నివసిస్తున్నారు? ఇదే మా ప్రశ్న. దీనికి సమాధానం ఏంటి? అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే? “ఇక్కడే అసలు కథ మరింత కలచివేసేలా అవుతుంది. భవనం సురక్షితం కాదు అని హెచ్చరిక ఇచ్చారనే ఆరోపణ నిజమైతే ఒక్కసారి చెప్పండి. ఎందుకు ఖాళీ చేయించలేదు? ఎందుకు విద్యార్థులను బయటకు పంపలేదు? ఎందుకు భవనంలో విద్యార్థులను కొనసాగనిచ్చారు?. అసలు ఎవరికీ తెలియకపోతే ఎవరికీ ఎందుకు తెలియలేదు? అదే కదా వ్యవస్థ పని. వ్యవస్థ అంటే విపత్తు జరిగిన తర్వాత వచ్చి ‘మేము పరిస్థితిని సమీక్షిస్తున్నాం’ అని చెప్పడం కాదు. వ్యవస్థ అంటే విపత్తు రాకుండా ఆపడం.

మాకు ఇంకో ఫోటో అవకాశం వద్దు. శిథిలాల దగ్గర రాజకీయనాయకుడు నిలబడటం అధికారులతో మాట్లాడటం,కెమెరాల ముందు ప్రకటనలు ఇవ్వడం… ‘పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నాం’ అనడం ఎంతవరకు కరెక్ట్ ? మనం ఈ సినిమాను ఆల్రెడీ చూశాం. విషాదం, రాజకీయనాయకులు,అధికారుల రాక, సంతాపాలు, ప్రకటనలు, కఠిన చర్యల హామీలు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో కథ అదృశ్యమైపోతుంది. మళ్లీ అదే పరిస్థితి. ప్రజలకు కావాల్సింది ఇది కాదు. ప్రజలకు ప్రదర్శనలు వద్దు. ఫోటో అవకాశాలు వద్దు. హామీలు వద్దు. ప్రాణాలు పోయిన తర్వాత పర్యటనలు వద్దు. ప్రజల ప్రాణాలు పోకముందే మనం రంగంలోకి దిగాలి. ఇదీ ప్రజలు కోరుకునేది.. ఈరోజు నేను జర్నలిస్ట్‌గా మాత్రమే అడగడం లేదు. నేను ఒక తండ్రిగా అడుగుతున్నాను. ఈ ఆరుగురు… సంఖ్యలు కాదు. గణాంకాలు కాదు. వాళ్లు ఎవరో ఒకరి పిల్లలు. ఒకరి కొడుకు. ఒకరి కూతురు. ఒక కుటుంబానికి మొత్తం భవిష్యత్తు. తల్లిదండ్రులు వాళ్లను ఢిల్లీకి పంపింది ఎందుకు? చదువుకోవడానికి. కెరీర్ నిర్మించుకోవడానికి. జీవితాన్ని నిర్మించుకోవడానికి. చనిపోవడానికి కాదు.

సురక్షితం లేని భవనంలో చనిపోవడానికి వారు పిల్లలను ఢిల్లీకి పంపలేదు. రేపు ఇంకో విద్యార్థి ఢిల్లీకి వస్తాడు. అతను ఒక గది తీసుకుంటాడు. ఒక భవనంలో ఉంటాడు. అప్పుడు ఆ భవనం సురక్షితం అని ఎవరు హామీ ఇస్తారు? ఎవరు? ఎమ్.సి.డి? ఢిల్లీ ప్రభుత్వం? పోలీసులు? భవనం యజమాని? ఎవరు? నాకు సమాధానం చెప్పండి! ‘భవనం కూలిన తర్వాత చూస్తాం’ అనడం కరెక్టా? అలా ఉండకూడదు. అది పాలన కాదు. రక్షణ బృందం సభ్యులు కూడా స్థలంలో తక్షణమే తమ పని చేస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. ప్రాణాలు కాపాడేందుకు పోరాడుతున్నారు. వాళ్లకు వందనం. కానీ,రక్షణ చర్య ముగిసిన తర్వాత పరిస్థితేంటి? ఇంకో చర్య ప్రారంభం అవ్వాలి. ఒక జవాబుదారీతనపు చర్య. ఎవరికి తెలుసు? ఎవరు తనిఖీ చేశారు? ఎవరు ఆమోదించారు? ఎవరు నిర్లక్ష్యం చేశారు? ఎవరు చర్య తీసుకోలేదు? చర్య తీసుకోవడంలో ఎవరు విఫలమయ్యారు? మరి… దీనికి ఎవరు జవాబుదారీ? ఎవరిది బాధ్యత, ఎవరు సమాధానం చెప్పాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రక్షణ పాలన కాదు. పరిహారం పాలన కాదు. సంతాపాలు పాలన కాదు. నివారణే పాలన. ఒక భవనం సురక్షితం కాదు అని తెలిసి కూడా అక్కడ విద్యార్థులు ఉంటే ఆ భవనం ఢిల్లీ నడిబొడ్డున ఉంటే ఆ భవనం కూలి యువకుల ప్రాణాలు పోతే ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. పత్రికా సమావేశంలో కాదు. ఫోటో అవకాశంలో కాదు. ‘కఠిన చర్య’ అనే ఇంకో హామీతో కాదు. సమాధానాలతో. ఎందుకంటే… ఈరోజు ఈ శిథిలాల కింద కేవలం మృతదేహాలు లేవు. ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను మట్టిలో పూడ్చేయలేరు. ఆ ప్రశ్నలను కప్పిపుచ్చలేరు. ఆ ప్రశ్నలను నిందల ఆటతో తప్పించుకోలేరు. మృతదేహాలు ప్రశ్నలు అడుగుతున్నాయి. ఢిల్లీ పెద్దలు వీటికి సమాధానం చెప్పాలి. రేపు, ఎల్లుందో కాదు..ఇప్పుడే..ఇప్పుడంటే ఇప్పుడే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.