Pakistan : సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు భారీ దాడి చేశారు. సౌదీకి చెందిన అరామ్‌కో చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ ఘటనలో 70 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కొన్ని చమురు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పాకిస్థాన్‌పై ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ కలిసి మక్కా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. మిగతా రెండు దేశాలు కూడా దాన్ని తమపై దాడిగానే భావిస్తాయని అప్పట్లో చెప్పుకున్నారు. దీంతో ఈ ఒప్పందాన్ని ముస్లిం దేశాల నాటో తరహా కూటమిగా ప్రచారం చేశారు.

కానీ ఇప్పుడు సౌదీపై హూతీలు దాడి చేసినా.. పాకిస్థాన్ సైన్యం నేరుగా రంగంలోకి దిగలేదు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం సౌదీకి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. దీంతో మక్కా ఒప్పందం ఏమైంది? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. సౌదీకి మద్దతుగా పాకిస్థాన్ సైన్యం ఎందుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.

Also Read : థాయ్‌ పట్టాయాలో అమెరికా సైనికుల షాపింగ్‌.. వారు ఎక్కువగా కొన్నవి అవే…

ఈ ఒప్పందం నాటో తరహాలో ఉండదు. ఒక దేశంపై దాడి జరిగితే మిగతా దేశాల సైన్యం వెంటనే యుద్ధంలోకి దిగాలని ఇందులో స్పష్టంగా లేదు. అలాగే ఎంత సైనిక సాయం చేయాలి, ఎలాంటి సాయం చేయాలి అనే విషయాలు కూడా ఖరారు కాలేదు. అంటే సౌదీపై దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్ సైన్యం యెమెన్‌కు వెళ్లాల్సిందేనని ఒప్పందం చెప్పడం లేదు. అవసరాన్ని బట్టి సౌదీకి ఆయుధాలు, రక్షణ పరికరాలు, సమాచారం లేదా శిక్షణ అందించవచ్చు.

సౌదీతో పాకిస్థాన్‌కు చాలా ఏళ్లుగా మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయి. సుమారు 8 వేల మంది పాకిస్థాన్ సైనికులు సౌదీలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సౌదీ సైనికులకు పాకిస్థాన్ శిక్షణ కూడా ఇస్తోంది. అయినా హూతీలపై నేరుగా పోరాడేందుకు పాకిస్థాన్ వెనుకాడుతోంది. దీనికి ప్రధాన కారణం ఇరాన్‌తో వచ్చే సమస్యలు, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్‌కు ఇరాన్‌తో సరిహద్దు ఉంది. హూతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్ హూతీలపై దాడి చేస్తే ఇరాన్‌తో కూడా గొడవ వచ్చే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్‌కు పెద్ద సమస్యగా మారొచ్చు.

పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో మరో యుద్ధంలోకి వెళ్తే భారీ ఖర్చు అవుతుంది. పైగా సౌదీ నుంచి పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం, రుణాలు, చమురు వంటి వాటి విషయంలో సహాయం అందుతోంది. అందుకే సౌదీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం పాకిస్థాన్‌కు ఉంది. మరోవైపు ఇరాన్‌తో శత్రుత్వం పెంచుకోవడం కూడా పాకిస్థాన్‌కు ఇష్టం లేదు. దీంతో ఒకవైపు సౌదీకి మద్దతు ఇవ్వాలి. మరోవైపు ఇరాన్‌తో గొడవ రాకుండా చూసుకోవాలి. ఈ రెండు పరిస్థితుల మధ్య పాకిస్థాన్ ఇరుక్కుపోయింది. అందుకే ప్రస్తుతం పాకిస్థాన్ సైనిక చర్యకు బదులుగా ప్రకటనలకే పరిమితమవుతోంది. దీంతో కొన్ని నెలల క్రితం భారీగా ప్రచారం చేసిన ‘మక్కా ఒప్పందం’పై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ తప్పనిసరిగా యుద్ధంలోకి దిగాల్సిందేనని చెప్పడం మాత్రం సరైంది కాదు.

Also Read : హిందూ గ్రూప్ విజిట్‌.. ఈఫిల్ టవర్ మూసివేత!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.