CJP Protest : నీట్-యూజీ (NEET UG) ప్రశ్నపత్రం లీకేజీ, నిర్వహణ లోపాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజున చేపట్టిన ఈ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అడ్డంకులను అధిగమించి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేసి, భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకోగా, ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.

Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: పార్లమెంట్ ముట్టడికి ‘సీజేపీ’ పిలుపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కేఅరెస్ట్

నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ

ఉద్రిక్త పరిస్థితుల వేళ సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. నిరసనకారులతో కేంద్ర ప్రభుత్వ మంత్రులు చర్చలు జరపడం, మరోవైపు పార్లమెంట్ భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

లేఖలోని ప్రధాన డిమాండ్లు & ఆరోపణలు

కేంద్ర మంత్రి నడ్డాకు సమర్పించిన లేఖలో సీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యాలను ఎత్తిచూపింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీతో పాటు సీబీఎస్‌ఈ 12వ తరగతి పోర్టల్ సమస్యలు, సీయూఈటీ (CUET) పరీక్షల నిర్వహణలో జరుగుతున్న జాప్యానికి ఆయనే బాధ్యత వహించాలని పేర్కొంది. దేశంలో పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడంలోనూ, అవసరమైన సంస్కరణలు తీసుకురావడంలోనూ విద్యా మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించింది.

శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని వెల్లడి

సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, తమ డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలతో చర్చిస్తానని జేపీ నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత మార్గంలో నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.

Also Read : హానర్ కుమ్మేసింది భయ్యా: ఏఐ ఫీచర్లతో ఊరమాస్ వాటర్‌ప్రూఫ్ మొబైల్..!

మా చర్చలు కొనసాగుతున్నాయి..జేపీ నడ్డా

కాగా, సీజేపీ ప్రతినిధులతో చర్చల అనంతరం జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ..”ఈ ఉదయం, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుండి మొదటిసారిగా ఒక ప్రతిపాదన వచ్చింది, ఉదయం 11:50 గంటల నుండి మా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగింది. వారి బృందంతో ప్రాథమికంగా వివరంగా మాట్లాడటం జరిగింది, వారు సాయంత్రం 4 గంటల సమయంలో నాకు ఒక రాతపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు. నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో పరిపాలనా యంత్రాంగానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేశాను” అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ట్వీట్ చేశారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.