Crime News
Crime News

తమిళనాడులోని కరూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలను పొలంలోని బావిలో చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కరూర్ జిల్లా వెంగమేడులోని కొంగు నగర్‌లో రామస్వామి, జానకి అనే దంపతులు జీవిస్తున్నారు. వీరి కుమార్తె సుగుణకు 13 ఏళ్ల క్రితం వేలాయుతంపాలేనికి చెందిన ప్రభుతో పెళ్లైంది. వీరికి 10ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు మొదలయ్యాయి. దీంతో తరచూ భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో సుగుణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని నవంబర్ 15న పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19కు ఎంపికైన యువ క్రికెటర్ మృతి!

అలా వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం చినకాలియాపాలయం గ్రామంలో ఉన్న రామస్వామి కుటుంబానికి చెందిన పొలంలోని బావి వద్ద స్థానికులు మృతదేహాలను గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వంగల్ పోలీస్ స్టేషన్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.

మృతులను రామస్వామి (63), అతని భార్య జానకి (60), కుమార్తె సుగుణ (35), మనవరాలు శివాని (10), మనవడు అతిరన్ (4)గా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సుగుణ, ఆమె భర్త ప్రభు మధ్య తలెత్తిన కుటుంబ కలహాలకు, ఈ ఐదుగురి మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read : బైనాన్స్ బిగ్ రిలీఫ్: $6.3 బిలియన్ల క్రిప్టో చోరీలో 90% రికవరీ