
93 ముంబై పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిన భవనాన్ని కూల్చివేసేందుకు ముంబై అధికారులు సిద్ధమయ్యారు. దక్షిణ ముంబై భేండీ బజార్ ప్రాంతంలోని పాక్మోడియా స్ట్రీట్‌లో ఉన్న ‘హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ఖానా’ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో.. రోడ్డు విస్తరణ కోసం పడగొట్టేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక చర్యలు తీసుకుంది.
గతంలో దావూద్ ఇబ్రహీం, అతని ఫ్యామిలీ ఈ భవనంలోనే నివశించేవారు. ఇప్పుడు ఈ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న 10 రూమ్‌లు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని వివాదాస్పద ప్రార్థనా మందిరాన్ని కూల్చివేసే ప్రక్రియను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం ముంబై నగరంలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ భవనాన్ని నేలమట్టం చేయడానికి BMC ప్రధానంగా రెండు కారణాలను ఎత్తిచూపింది. అందులో ఒకటి.. చాలా కాలంగా శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని మున్సిపల్ అధికారులు ‘C-1’ కేటగిరీ కింద ప్రమాదకరమైన భవనంగా వర్గీకరించారు. అక్కడికి వచ్చే వారికి, రోడ్డుపై నడిచే బాటసారులకు ఇది ప్రాణాపాయంగా మారిందని అధికారులు తెలిపారు.
Also Read : గుండె పగిలే తీవ్ర విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..!
రెండోది.. భేండీ బజార్‌ను ఆధునిక పద్ధతిలో మార్చే క్లస్టర్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా.. ప్రతిపాదిత అంతర్గత రోడ్డు విస్తరణకు ఈ భవనంలోని కొంత భాగం అడ్డుగా ఉందని BMC తెలిపింది. ఈ చర్యలకు 2020 ఆగస్టు 31 నాటి బాంబే హైకోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు ఆధారంగా చేసుకున్నారు.
భవనం చరిత్రను పరిశీలిస్తే.. దీనిని మొదట హజ్ యాత్రికుల బస కోసం నిర్మించిన ముసాఫిర్‌ఖానాగా ఉపయోగించేవారు. కాలక్రమేణా ఇందులో షాపులు, నివాస గదులు ఏర్పడ్డాయి. అదే సమయంలో దావూద్ ఇబ్రహీం తన తల్లిదండ్రులతో కలిసి రెండో అంతస్తులో అద్దెకు నివసించేవాడు. అనంతరం ముంబైలో దావూద్ ప్రాబల్యం పెరగడంతో అద్దె ఒప్పందం కాస్త కనుమరుగైంది. ఆ తర్వాత ఆ భవాన్ని కబ్జా చేసి రెండో అంతస్తు మొత్తాన్ని దావూద్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇక్కడే అతడి ‘డి-కంపెనీ’ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది.
ఇక 1986లో దావూద్ భారత్ వదిలి వెళ్లిపోయిన తర్వాత కూడా.. అతడి అనుచరులు ఈ భవనంలోనే చురుకుగా తిరిగేవారని సమాచారం. ఆ తర్వాతి కాలంలో భవనంలోని కొన్ని భాగాలు తొలగించబడగా.. పునరాభివృద్ధి ట్రస్ట్ ద్వారా ఈ ఆస్తి అభివృద్ధి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కూల్చివేత సమయంలో భవనం కింది అంతస్తులో ఉన్న ప్రార్థనా మందిరం విషయంలో వివాదం తలెత్తింది.
భవనంలోని మిగతా రూమ్‌లను చాలా వరకు ఖాళీ చేసినప్పటికీ.. కింది అంతస్తులోని ప్రార్థనా స్థలాన్ని ఇంకా వినియోగిస్తున్నారు. దీంతో స్థానికులు, ప్రార్థనా మందిర నిర్వాహకులు ఈ కూల్చివేతపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముంబైలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. మొత్తంగా శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించి రోడ్డు విస్తరణ, పునరాభివృద్ధి పనులను చేపట్టేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
Also Read : బర్డ్ ఫ్లూ ముప్పుకు చెక్.. భారత్ తొలి స్వదేశీ H5N1 వ్యాక్సిన్ సిద్ధం!









