
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ ‘బైనాన్స్’ భారీ సైబర్ దాడి నుంచి వేగంగా కోలుకుంది. ఇటీవల చోరీకి గురైన దాదాపు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలో 90 శాతాన్ని విజయవంతంగా రికవరీ చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మిగిలిన 10 శాతం ఫండ్స్‌ను కూడా త్వరలోనే వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది.
ఈ హ్యాకింగ్ వల్ల యూజర్లకు ఎటువంటి నష్టం వాటిల్లదని, పోయిన మొత్తాన్ని పూర్తిగా తామే భరిస్తామని బైనాన్స్ యాజమాన్యం స్పష్టమైన భరోసా ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా నిలిపివేసిన విత్‌డ్రా సేవలను కూడా తొలివిడతగా పునఃప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ భారీ సైబర్ అటాక్ వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్ల గ్రూప్స్ ఉన్నట్లు అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI అనుమానిస్తోంది. దొంగిలించిన క్రిప్టో అసెట్స్‌ను హ్యాకర్లు ‘ఈథీరియం’ రూపంలోకి మార్చారని, అనంతరం స్వాప్ సేవల ద్వారా బిట్కాయిన్లుగా కన్వర్ట్ చేసేందుకు ప్లాన్ చేశారని FBI పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఉత్తర కొరియా పూర్తిగా కొట్టిపారేసింది.
హ్యాకింగ్ గుర్తించిన వెంటనే అలర్ట్ అయిన బైనాన్స్ యాజమాన్యం లావాదేవీలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. తొలుత సంస్థలోని ఓ ఇంజినీర్ ల్యాప్‌టాప్ ద్వారా హ్యాకర్లు ఇంటర్నల్ సర్వర్లలోకి చొరబడ్డారని భావించినప్పటికీ, తర్వాత అంతర్గత దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హ్యాకర్లు వ్యవస్థీకృతంగా, ఒక ముఠాగా ఏర్పడి బైనాన్స్ సర్వర్లపై గ్రూప్ అటాక్ చేశారని సంస్థ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ టెంగ్ వివరించారు. దర్యాప్తు సంస్థలకు ఎలాంటి డిజిటల్ ఆధారాలు దొరకకుండా ‘సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెకానిజం’ వంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉపయోగించినట్లు గుర్తించారు.
ప్రస్తుతం ఈ భారీ హ్యాకింగ్‌పై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ విస్తృతంగా విచారణ జరుపుతోంది. క్రిప్టో ప్రపంచాన్ని తీవ్ర కుదుపునకు గురిచేసిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.









