NEET Paper Leak : నీట్‌ పేపర్‌ లీక్‌ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీజేపీ ఆందోళనతో  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే బిహార్‌ లో మాత్రం ఈ ఆందోళనలు మరోసారి ఉద్రిక్తతలకు దారితీశాయి.  గత నెలలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా అరెస్ట్‌ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యార్థులు మరోసారి నిరసనలకు దిగారు. ఆందోళన సందర్భంగా అరెస్టైన విద్యార్థులపై కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి.. దానిని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు, యువజన సంఘాల కార్యకర్తలు మంగళవారం పట్నాలో ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది.

Also Read : గాల్లో ఎయిరిండియా విమానానికి తీవ్ర కుదుపులు.. పలువురికి గాయాలు..

కాగా..పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు అక్కడి నుంచి సీఎం సమ్రాట్ చౌదరి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఇన్‌కమ్ ట్యాక్స్ చౌరస్తా వద్దకు చేరుకున్న  నిరసనకారులను..  పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఆందోళన కారులను ముఖ్యమంత్రి ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించడం వివాదస్పదమైంది. అయితే.. నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు  ప్రయత్నించడం మూలంగానే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వాటర్ కేనన్లు ఉపయోగించామని పోలీసులు సమర్థించుకున్నారు.

Also Read : ఈ రాశులకు అదిరిపోయే అదృష్టం.. పట్టిందల్లా బంగారమే.. ఆ రాశులేవంటే?

నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై గత నెలలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగగా బిహార్‌లో నిర్వహించిన బంద్ సందర్భంగా సుమారు 600 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వారిలో మైనర్లుగా గుర్తించిన సగం మందిని విడుదల చేశారు. కానీ ఇంకా సుమారు 400 మందికి పైగా జైలులోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆందోళన కారులతో జరిగిన చర్చల్లో కేంద్రం తో పాటు, రాష్ట్ర హోంశాఖ  కేసులను ఉపసంహరించుకుంటామని  ప్రకటించినప్పటికీ.. నేటికీ ఆ హామీ అమలు కాలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా జైలునుంచి ఎంతమంది విద్యార్థులు విడుదలయ్యారు?, ఎంతమంది జైలులో ఉన్నారనే విషయంపై అధికారిక జాబితాను విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆందోళనలకు స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రామ్ మద్దతు ఇవ్వడం గమనార్హం.

కాగా, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పూర్తిస్థాయిలో నెరవేర్చకుంటే మళ్లీ నిరసన చేపడ్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించిన విషయం తెలిసిందే.  విద్యాశాఖ మంత్రి రాజీనామతో తమ కీలక డిమాండ్లలో ఒకటి మాత్రమే  నెరవేరిందని,  ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుంటే మరోసారి ఆందోళనకు దిగడానికి ఏమాత్రం వెనుకాడమని ఆయన హెచ్చరించిన మరునాడే విద్యార్థులు ఆందోళనకు దిగడం గమనార్హం.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.