కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. సీఈసీ నిర్ణయాల వెనుక ఉన్న అసలు నిజానిజాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌‌కు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరితో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఆయా నిర్ణయాలు నిజంగానే ఏకపక్షంగా జరిగాయా? లేదా చట్టబద్ధంగా తీసుకున్నారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఈ కేసులో పిటిషనర్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఆరోపణలు లేదా పత్రికా నివేదికల ఆధారంగా ఒక అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేయలేమని స్పష్టం చేసింది. నాణేనికి ఉన్న రెండో వైపు కూడా పరిశీలించాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని వ్యాఖ్యానించింది. ముందుగా ఈసీ ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై ఆలోచిస్తామని తెలిపింది.