గృహ అవసరాలకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ నేడు వేలాది మంది గ్రామీణ మహిళలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కష్టపడి గెలవగలమనే ఆలోచన ఉండటంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఎలాంటి సాధనైనా సాధ్యమేనని ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ మహిళలు నిరూపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన 138వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ప్రతాప్‌గఢ్ ఉసిరి విప్లవాన్ని, మహిళా స్వయం సహాయక బృందాలు సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉసిరి ప్రాసెసింగ్ ద్వారా మహిళలు సాధిస్తున్న విజయాలను ఈ ప్రపంచానికి తెలియజేశారు.

Also Read : అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. ఎల్‌పీజీ ఇ-కేవైసీ, యూపీఐ ఛార్జీలు, ఎఫ్‌డీ రేట్లలో మార్పులు!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు ఉసిరి సాగుతో దశాబ్దాల అనుబంధం ఉంది. గోడే రత్నావళికి చెందిన షేర్ బహదూర్ సింగ్ 1965లో ప్రతాప్‌గఢ్ నగరంలోని రాజా ప్రతాప్ బహదూర్ కోట నుండి ఒక చిన్న ఉసిరి మొక్కను తెచ్చి తన ఇంటి సమీపంలో నాటారు. ఆ ఒక్క మొక్క కాలక్రమేణా మహా వృక్షమై గ్రామంలోని వారందరికీ పండ్ల తోటల సాగుపై ఆసక్తిని పెంచింది. ఈ ఒక్క ఉసిరి చెట్టుతో రాణిగంజ్ తహసీల్, దేవ్‌గఢ్ కమాసిన్ గ్రామానికి చెందిన ‘సావిత్రిబాయి ఫూలే స్వయం సహాయక బృందం’ వ్యాపారం చేస్తూ విజయాన్ని సాధించారు. సాధిస్తున్నారు.

2020లో సుష్మా దేవి, కమలేష్ కుమారి ఇద్దరు గ్రామీణ మహిళలు ఈ వ్యాపారాన్ని చిన్న సంఘం ద్వారా ప్రారంభించారు. వీరు మొదట ఇంట్లోనే కొద్దిపాటి పెట్టుబడితో ‘ఉసిరి జామ్’ తయారీని మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన ఉసిరి సాగుతో నేడు ఏడాదికి రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతాప్‌గఢ్ జిల్లాలో 3,321 మంది రైతులు ఏకంగా 7,083 హెక్టార్లలో పండిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఏటా దాదాపు 74,086 మెట్రిక్ టన్నుల ఉసిరి దిగుబడి వస్తోంది. దేశమంతటా ఉత్పత్తి అయ్యే మొత్తం ఉసిరిలో సుమారు 46 శాతం వాటా ఒక్క ప్రతాప్‌గఢ్ జిల్లా నుంచే వస్తోంది. అందుకే ఉసిరిని ఆ జిల్లాల్లో ‘అమృత ఫలం’ అని పిలుస్తారు.

అయితే కేంద్ర ప్రభుత్వ ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పథకం ఈ మహిళల జీవితాలను మార్చేసింది. ఈ పథకం ద్వారా వారికి అవసరమైన ఆధునిక ప్రాసెసింగ్ యంత్రాలు, తక్కువ వడ్డీకే రుణాలు, శిక్షణ లభించాయి. వ్యాపారం క్రమంగా విస్తరించడంతో జామ్‌తో పాటు ఉసిరి క్యాండీ, బర్ఫీ, లడ్డూలు, ఊరగాయలు, పాచక్ చూరన్, జ్యూస్ వంటి అనేక రకాల పదార్థాలను తయారు చేయడం ప్రారంభించారు. నేడు ఈ సంఘంలో 11 మంది మహిళలు భాగస్వాములై క్రమం తప్పకుండా ఉపాధి పొందుతున్నారు. ఉసిరి ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆ మహిళలు డబ్బులు సంపాదిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.

అలాగే జిల్లాలోని ‘వింధ్యవాసిని స్వయం సహాయక బృందం’ కూడా ఉసిరి ఊరగాయ, జీర్ణకారి పొడులు తయారు చేస్తూ వ్యాపార ప్రదర్శనల ద్వారా లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 196కి పైగా ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు కేరళ, మధ్యప్రదేశ్, కాశ్మీర్, బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు కెనడా, అమెరికా, సౌదీ అరేబియా, టాంజానియా, శ్రీలంక, బ్యాంకాక్ వంటి విదేశాలలో కూడా భారీ డిమాండ్ ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. “మన గ్రామాలు, చిన్న పట్టణాల ప్రత్యేక ఉత్పత్తులు కేవలం స్థానిక మార్కెట్లకే పరిమితం కాకూడదు. ప్రపంచ మార్కెట్లలోని వినియోగదారులకు చేరినప్పుడే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది” అని పేర్కొన్నారు. ప్రతాప్‌గఢ్ ఉసిరి మహిళల కృషి వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ స్వప్నాలకు నిజమైన రూపమని కొనియాడారు. రాబోయే పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని కోరారు. అలాగే ఉసిరి ప్రాసెసింగ్ ప్రాముఖ్యతతో పాటు దేశంలో పోషకాహార లోపాన్ని నివారించడానికి సెప్టెంబర్ నెలలో చేపట్టిన పోషణ్ మాస కార్యక్రమాలను ప్రధాని తెలిపారు.

Also Read : భారత్‌లో 96 బోయింగ్ విమానాలకు సాఫ్ట్‌వేర్ ముప్పు.. అసలు కాక్‌పిట్‌లో ఏమైంది?

ఛత్తీస్‌గఢ్‌లో పెసరపప్పు వాడకాన్ని ప్రోత్సహించడానికి ‘హర్ ఘర్ ముంగా–ఘర్ ఘర్ ముంగా’ ఉద్యమం నిర్వహించారు. గుజరాత్‌లో చిరుధాన్యాలతో తక్కువ ఖర్చుతో కూడిన వంటకాల పోటీ ‘వాంగి స్పర్ధ’ నిర్వహించగా 2 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. మిజోరంలో గ్రామీణ ప్రాంతాల్లో ‘పోషణ వాటికలు’ ఏర్పాటు చేశారని ప్రధాని మోదీ ఈ మన్ కీ బాత్ సందర్భంగా తెలిపారు.