విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో కంపెనీ ఓ సాఫ్ట్‌వేర్ లోపాన్ని(Software Threat) గుర్తించింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన సుమారు 96 విమానాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న 53 విమానాలు, అకాసా ఎయిర్ వద్ద ఉన్న 43 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఈ సాఫ్ట్‌వేర్ గ్లిచ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read : మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్‌

సాధారణంగా కాక్‌పిట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వల్ల ఈ సమస్య తలెత్తిందని బోయింగ్ అంతర్గత వర్గాలు తెలిపాయి. ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితుల వల్ల విమాన సిబ్బంది మొదటి ప్రయత్నంలో ల్యాండింగ్ విఫలమై ప్రణాళికాబద్ధమైన మార్గాన్ని మార్చుకోవాల్సి వస్తే ఈ లోపం వెలుగులోకి వచ్చింది. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిన తర్వాత తదుపరి ల్యాండింగ్ మార్గం ముందుగా అనుకున్న దానికి భిన్నంగా ఉంటే ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ సమస్య వల్ల విమానం పైలట్ల నియంత్రణ తప్పదని.. మాన్యువల్‌గా విమానాన్ని సురక్షితంగా నడపవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ల్యాండింగ్ ప్రణాళిక మారినప్పుడు సిస్టమ్‌ను ఎలా రీసెట్ చేయాలో బోయింగ్ ఇప్పటికే అన్ని ఆపరేటర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది.

ఈ సాఫ్ట్‌వేర్ సమస్యపై గత నెలలోనే 737 మ్యాక్స్ విమానాలను నడుపుతున్న ఆపరేటర్లందరికీ సమాచారం అందించామని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. ఈ లోపాన్ని శాశ్వతంగా నివారించడానికి కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అకాసా ఎయిర్ ఈ విషయంపై స్పందిస్తూ తాము బోయింగ్‌తో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని తమ విమానాల భద్రతపై ఎలాంటి ప్రభావం పడలేదని స్పష్టం చేసింది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, భారత విమానయాన నియంత్రణ సంస్థ ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Also Read : 30 సెప్టెంబర్… మోదీ శకం ముగింపుకు ఇదే ఆరంభమా?

గతంలో జరిగిన కొన్ని వరుస ప్రమాదాలు, సాంకేతిక లోపాల వల్ల భారతదేశంలో బోయింగ్ విమానాల భద్రతపై నిఘా బాగా పెరిగింది. గతంలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు సంబంధించి ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ సమస్యలు, ముందస్తు తనిఖీల అవసరం తలెత్తాయి. అయితే ఆ సంఘటనలు 787 డ్రీమ్‌లైనర్ మోడల్‌కు సంబంధించినవి. అయితే ప్రస్తుత సమస్య కేవలం 737 మ్యాక్స్ విమానాలకు మాత్రమే సంబంధించినది.