నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. రోజూ తగినంత నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలామందికి తెలియక నీరు తాగే విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. సరైన పద్ధతిలో నీరు తాగకపోతే అది జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నీరు తాగేటప్పుడు తెలిసో తెలియక ఈ తప్పులు అసలు చేయవద్దు. అవేంటో చూద్దాం.

Also Read : గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. WGC సంచలన నివేదిక.. త్వరలోనే పెరగనున్న ధరలు

నిలబడి నీళ్లు తాగడం

చాలామంది త్వరత్వరగా నిలబడే నీళ్లు తాగేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిలబడి నీళ్లు తాగినప్పుడు అవి ఎలాంటి వడపోత లేకుండా నేరుగా పొట్టలోకి చాలా వేగంగా వెళ్తాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా కిడ్నీల పనితీరు మందగించి కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూర్చుని, ప్రశాంతంగా నీళ్లు తాగాలి.

తిన్న వెంటనే నీళ్లు తాగడం

భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం చాలామందికి అలవాటు. ఇలా చేయడం వల్ల పొట్టలోని జీర్ణ రసాలు, యాసిడ్లు పలచబడిపోతాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా అరగక గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అందుకే భోజనానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం మంచిది.

ఐస్ వాటర్

ఎండలోంచి రాగానే లేదా దాహంగా అనిపించగానే ఫ్రిజ్‌లోని చల్లటి నీళ్లను తాగడం చాలామందికి అలవాటు. అతి చల్లని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్య వస్తుంది. అంతేకాకుండా ఇవి రక్తనాళాలను సంకోచింపజేసి, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. గొంతు నొప్పి, జలుబు సమస్యలకు కారణమవుతాయి. దానికి బదులుగా గోరువెచ్చని నీళ్లు లేదా కుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Also Read : వినియోగదారులకు బిగ్ షాక్.. ఇన్సూరెన్స్ లేకపోతే బండికి పెట్రోల్ కట్!

ఒకేసారి ఎక్కువగా నీళ్లు తాగడం

రోజంతా నీళ్లు తాగడం మర్చిపోయి ఒక్కసారిగా దాహం వేసినప్పుడు లీటరు నీటిని ఒకే గుటకలో తాగేస్తుంటారు. ఇలా ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరం దానిని సరిగ్గా పీల్చుకోలేదు. కిడ్నీలపై ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి పడుతుంది. కాబట్టి నీటిని గుటక గుటకగా కొద్దికొద్దిగా రోజంతా తాగుతూ ఉండాలి.

అతిగా లేదా చాలా తక్కువగా నీళ్లు తాగడం

కొందరు అవసరానికి మించి అతిగా నీళ్లు తాగుతుంటే మరికొందరు రోజంతా అసలు నీళ్లే తాగరు. రెండు పరిస్థితులూ హానికరమే. తక్కువ నీళ్లు తాగితే డిహైడ్రేషన్, మలబద్ధకం, చర్మ సమస్యలు వస్తాయి. అలాగే పరిమితికి మించి నీళ్లు తాగితే శరీరంలో సోడియం స్థాయిలు పడిపోయి ఓవర్ హైడ్రేషన్ సమస్య వస్తుంది. దాహం వేసినప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి రోజూ 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం సరిపోతుంది.