DMK MLA : తమిళనాడు సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విళత్తికుళం ప్రాంతంలోని ఆయన నివాసంలో పోలీసులు భారీగా చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. తమిళగ వెట్రి కళగం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మాజీ సీఎం, డీఎంకే అగ్రనేత ఎం. కరుణానిధి జయంతి సందర్భంగా విళత్తికుళంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మార్కండేయన్ ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన సీఎం విజయ్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని టీవీకే సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

Also Read : మలుపు తిప్పిన ఘటన: ఆస్తులున్నా.. రోజుకు 12 గంటలు క్యాబ్ నడుపుతున్న కోటీశ్వరుడు!

ఇదే తరహాలో, కొద్ది రోజుల క్రితమే డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించినా, కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిత రాధాకృష్ణన్‌ను ఆథూరులో పర్యటిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

జూన్ 20న ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల తమ సీఎం ప్రతిష్ట మసకబారిందని టీవీకే ఫిర్యాదు చేసింది. ఈ కేసుల్లో ఎమ్మెల్యేలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 352, సెక్షన్ 353 (2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.