Datia By Election Protest : మధ్యప్రదేశ్‌లోని దాటియా అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికల వేళ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో టికెట్ల కేటాయింపు తీవ్ర ఘర్షణలకు, హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఈసారి టికెట్ నిరాకరించడమే ఈ దారుణ పరిస్థితికి ముఖ్య కారణమైంది. ఆయన స్థానంలో అధిష్ఠానం అశుతోష్ తివారీ పేరును అనూహ్యంగా తెరపైకి తేడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మిశ్రా అనుచరులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయి నిరసనలకు దిగారు.

Also Read : PF ఖాతాదారులకు గుడ్ న్యూస్: ఈపీఎఫ్‌ఓ వడ్డీ జమ ప్రారంభం – బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

ఈ ఆందోళనలు కేవలం నిరసనలతో ఆగకుండా హింసాత్మక రూపం దాల్చాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు శనివారం తెల్లవారుజాము వరకు ఉద్రిక్తంగా కొనసాగాయి. సుమారు 3,000 మందికి పైగా ఉన్న అభ్యర్థి మద్దతుదారులు దతియా గుండా వెళ్లే వ్యూహాత్మక జాతీయ రహదారి-44 (NH-44)పై బైఠాయించి, ‘చక్కా జామ్’ చేపట్టారు. దాదాపు 11 గంటల పాటు సాగిన ఈ రహదారి దిగ్బంధనం వల్ల రవాణా వ్యవస్థ తీవ్రంగా స్తంభించిపోయింది.

ఈ దిగ్బంధనం కారణంగా జాతీయ రహదారిపై ఏకంగా 20 నుంచి 25 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీని ప్రభావం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దాటియా, ఝాన్సీ, శివపురి, గ్వాలియర్ అనే నాలుగు పొరుగు జిల్లాల రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందులో అత్యధికంగా గ్వాలియర్ ప్రాంతం ప్రభావితమైంది. వందలాది ప్రయాణీకుల బస్సులు, సరుకు రవాణా ట్రక్కులతో పాటు అత్యవసర వైద్య సేవలు అందించే అనేక అంబులెన్సులు గంటల తరబడి ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రహదారిపై రాకపోకలను పునరుద్ధరించేందుకు ,పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, పరిపాలనా యంత్రాంగం రాత్రంతా శ్రమించింది. ఆందోళనకారులకు పదే పదే నచ్చజెప్పేందుకు, శాంతియుతంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు దాటియా జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) స్వప్నిల్ వాంఖేడే, ఎస్పీ మయూర్ ఖండేల్వాల్ స్వయంగా రంగంలోకి దిగారు. అయితే, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మళ్లీ చర్చలు జరిపేందుకు యత్నించగా, ఆందోళనకారులు ఏమాత్రం వినకుండా కంట్రోల్ తప్పి ప్రవర్తించడం ప్రారంభించారు.

Also Read : బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం.. కాదని చేసుకుంటే అంతే సంగతులు

పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్న పోలీసులపై ఒక్కసారిగా నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. గుంపుగా ఏర్పడి విచక్షణా రహితంగా రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ ఊహించని దాడిలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీలతో పాటు స్వయంగా హెల్మెట్ ధరించిన జిల్లా మేజిస్ట్రేట్ స్వప్నిల్ వాంఖేడే కూడా గాయపడ్డారు. అంతేకాకుండా ఎస్డీపీఓ (SDPO) చేతికి తీవ్ర గాయమవడంతో పాటు మొత్తం ఎనిమిది మంది పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

రాళ్ల దాడితో ఆగకుండా ఉగ్రరూపం దాల్చిన నిరసనకారులు సమీపంలోని కార్యాలయ భవనాల్లోకి వెనక్కి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాదాపు మూడు నుంచి నాలుగు పోలీసు వాహనాలతో పాటు అనేక సరుకు రవాణా ట్రక్కులను తలక్రిందులు చేశారు. వాహనాల అద్దాలను పగలగొట్టి తీవ్ర స్థాయిలో ధ్వంసం చేయడంతో దాటియా వీధులన్నీ తీవ్ర భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడాయి.

పరిస్థితి చేయిదాటిపోవడంతో, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు తుదకు బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించాల్సి వచ్చింది. అయినప్పటికీ, స్థానిక యంత్రాంగం అత్యంత ఓర్పుతో వ్యవహరించిందని డీఎం స్వప్నిల్ వాంఖేడే వెల్లడించారు. తాము ఎలాంటి లాఠీచార్జ్ గానీ లేదా ప్రతికారంగా రాళ్ల దాడికి గానీ పాల్పడలేదని, శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారిని శాంతియుతంగా లోపల నుంచి బయటకు వచ్చి ఇళ్లకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఈ రాజకీయ వివాదానికి మూలాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నాయి. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాటియా నుంచి పోటీ చేసిన నాటి హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి చేతిలో 7,500కి పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక కేసులో రాజేంద్ర భారతికి ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. దీంతో దాటియా స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

ఉపఎన్నిక ఖాయం కావడంతో మరోసారి తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించిన నరోత్తమ్ మిశ్రా, ఇప్పటికే నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా బిహార్, గుజరాత్‌లతో పాటు దాటియా స్థానానికి జులై 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపుగా ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఊహించని పరిణామంగా శుక్రవారం బీజేపీ అధిష్ఠానం అశుతోష్ తివారీ పేరును అభ్యర్థిగా ప్రకటించడంతో మిశ్రా వర్గంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం దాటియాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండటంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులు క్రమశిక్షణతో ఇళ్లకు తిరుగుముఖం పట్టాలని, ఐదు లేదా పదిమంది చొప్పున గుంపులుగా వచ్చి మళ్లీ గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యంత్రాంగం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. బీజేపీ ఆశావాహుల మధ్య నెలకొన్న ఈ టికెట్ వివాదం , దాని తదనంతర హింసాత్మక పరిణామాలు రాబోయే దాటియా ఉపఎన్నికను రాజకీయంగా అత్యంత ఉత్కంఠభరితంగా మార్చేశాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.