
Ayodhya : శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం పేరుతో నకిలీ లడ్డూలు అమ్మడంపై అమెజాన్ వెబ్‌సైట్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎలాంటి అనుమతి లేకుండా, కేవలం వ్యాపారం కోసం భక్తులను మోసం చేసేలా ప్రచారం చేసినందుకు అమెజాన్ కంపెనీకి లక్ష రూపాయిల ఫైన్ పడింది. అయోధ్య రామాలయ ట్రస్ట్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా సాధారణ లడ్డూలను రాముడి ప్రసాదంగా అమ్మడం తప్పు అని, ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడమేనని అధికారులు చెప్పారు.
ఈ విషయంపై 2024 జనవరిలో వ్యాపారుల సంఘం ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలైంది. అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం అయ్యే సమయంలో, భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు ఈ లడ్డూలను అమ్మకానికి పెట్టాయి. బీహార్ బ్రదర్స్ అనే బ్రాండ్ పేరుతో నెయ్యి లడ్డూలు, పాల పేడాలను రాముడి ప్రసాదం అని చెప్తూ అమ్మారు. ఈ లడ్డూల ఫోటోల దగ్గర రాముడి బొమ్మలు, అయోధ్య గుడి పేర్లు పెట్టి భక్తులు నిజమైన ప్రసాదం అనుకునేలా మోసం చేశారు.
నోటీసులు రాగానే అమెజాన్ ఆ స్వీట్లను తమ సైట్ నుంచి తీసేసి, ఆ వస్తువులు అమ్మిన వ్యాపారి వివరాలను అందించింది. మేము కేవలం వస్తువులు అమ్మడానికి ఒక సైట్ మాత్రమే ఇచ్చామని, ఆ లడ్డూల వివరాలకు, ధరలకు తాము బాధ్యులం కాదని అమెజాన్ చెప్పింది. కానీ ఉచితంగా అమ్మేలా సైట్ ఇచ్చి, దాని ద్వారా కమీషన్ తీసుకున్నందుకు అమెజాన్ కూడా బాధ్యత వహించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.









