
Pakistan : ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం బయట ఉన్న ఇనుప గేట్లు, సెక్యూరిటీ బెంచీలు, బారికేడ్లను గురువారం అధికారులు తొలగించారు. రోడ్డుపై రాకపోకలకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో వీటిని తీసేశారు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం బయట ఉన్న బారికేడ్లను పాక్ ప్రభుత్వం తీసేసింది. దానికి పోటీగానే భారత్ కూడా ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై భారత అధికారులు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
మరోవైపు అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ సీఎం ఉమర్ అబ్దుల్లాతో మాట్లాడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో ఒక ముఖ్యమైన భాగమని చెప్పారు. ఈ మాటలపై పాకిస్తాన్ తీవ్రంగా కోపపడింది. తమ దేశంలో ఉన్న అమెరికా అధికారులను పిలిచి గట్టిగా నిరసన తెలిపింది.
కాశ్మీర్ అంశంపై ఇండియా, పాకిస్తాన్ తమలో తామే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా భావిస్తోంది. మూడో దేశం వచ్చి జోక్యం చేసుకోవడం ఇండియాకు ఎంతమాత్రం నచ్చదు. ఇదిలా ఉంటే, అమెరికా రాయబారితో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, పర్యాటకం గురించి మాట్లాడానని సీఎం ఉమర్ అబ్దుల్లా చెప్పారు.









