Google : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్, భారతీయ కళాశాల విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆఫర్‌ చేసింది. విద్యార్థుల అభ్యాసానికి మద్దతుగా, ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు గాను ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన విద్యార్థులు జెమినీ ఆధారిత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు.

ఈ వివరాలను గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో పంచుకుంది. ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా విద్యార్థులు ‘జెమిని ఓమ్నీ’ వంటి శక్తివంతమైన ఏఐ మోడల్‌కు యాక్సెస్ పొందడానికి అవకాశం ఉంది, దీనిలో సాధారణ యూజర్లతో పోలిస్తే రెట్టింపు వినియోగ పరిమితులు, 400 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపింది. దీంతో పాటు, గూగుల్ ఏఐ ప్రో, యూట్యూబ్ ప్రీమియం కలిగిన బండిల్‌ను విద్యార్థులకు 70 శాతం వరకు తగ్గింపుతో అందజేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనివల్ల యాడ్స్ లేకుండా సంగీతం, వీడియోలను ఆస్వాదించడానికి వీలవుతుంది..

దీనితో పాటు భారతీయ విద్యార్థుల కోసం గూగుల్‌ మూడు రకాల ఆఫర్లను ప్రకటించింది. గూగుల్ ఏఐ ప్లస్‌ను అర్హత కలిగిన విద్యార్థులు ఏడాది పాటు ఉచితంగా పొందడానికి అవకాశం ఉంది. గూగుల్ ఏఐ ప్రోను పొందాలంటే నెలకు రూ.489 చొప్పున చెల్లించి గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొందే అవకాశం ఉంది. ఇక, యూట్యూబ్ ప్రీమియమ్‌తో కలిపిన గూగుల్ ఏఐ ప్రో ధర నెలకు రూ.550గా నిర్ణయించారు.

ఈ ఆఫర్లు మాత్రమే కాకండా విద్యార్థుల కోసం గూగుల్ మరిన్ని టూల్స్‌ ను కూడ ప్రవేశ పెట్టింది. జెమిని, గూగుల్ సెర్చ్‌లో సరికొత్త లెర్నింగ్ టూల్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘స్టూడెంట్ హబ్’ను రూపొందించినట్లు వెల్లడించింది. ఇది విద్యార్థులు చదువును క్రమబద్ధంగా నేర్చు కోవడానికి, జెమిని టూల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ‘స్టడీ నోట్‌బుక్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా గూగుల్‌ పరిచయం చేసేందుకు సిద్ధమైంది.. ఇది డయాగ్నస్టిక్ క్విజ్‌ల ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి, వారి లక్ష్యాలకు అనుగుణంగా వ్యక్తిగత స్టడీ ప్లాన్‌లను రూపొందించి వారికి ఇస్తుంది.

ఇవి మాత్రమే కాకండా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా వాయిస్ ద్వారా రీసెర్చ్ రిపోర్టులను అడిగి తెలుసుకునేందుకు వీలుగా ‘జెమిని లైవ్’ ఫీచర్‌ను విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక గూగుల్ సెర్చ్‌లో క్లిష్టతరమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఇంటరాక్టివ్ విజువల్స్, వివిధ సబ్జెక్టులపై ప్రాక్టీస్ క్విజ్‌లు, గూగుల్ లెన్స్ ద్వారా దశలవారీగా కాన్సెప్ట్‌లను నేర్చుకునే సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేనుంది.

కాగా, ఈ ఆఫర్‌ భారత్‌తో పాటు 140కి పైగా దేశాల్లో అందుబాటులోకి రానుందని గూగుల్ పేర్కొంది. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన వెరిఫికేషన్ పూర్తి చేసి, డిసెంబర్ 31 లోపు ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని కంపెనీ వివరించింది. సురక్షితమైన వాతావరణంలో, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వ్యక్తిగత అభ్యాసానికి పూర్తి మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమని గూగుల్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.