Parliament:  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఉదయం పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్లమెంటు వైపు మార్చ్ చేపట్టడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. నిరసనను అదుపు చేసేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

Also Read : పార్లమెంటులో కొత్త బిల్లు.. ఇలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష!

న్యూఢిల్లీ జిల్లాలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) అమలులో ఉందని, ఈ నిబంధనల ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి తిరగడం, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే ముందస్తు అనుమతితో నిరసనలు తెలపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చ్ నిర్వహించడానికి సీజేపీ నుంచి తమకు ఎటువంటి అధికారిక అనుమతి రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఈ మార్చ్‌ను మొదట సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యా వ్యవస్థ వైఫల్యాలు, పేపర్ లీకేజీలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి, పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చిస్తామని హామీ ఇస్తేనే తన నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, ఆసుపత్రిలోనే రాజకీయ నేతలు వచ్చి హామీ ఇవ్వాలని ఆయన మూడు షరతులు పెట్టారు.

Also Read : మలుపు తిప్పిన ఘటన: ఆస్తులున్నా.. రోజుకు 12 గంటలు క్యాబ్ నడుపుతున్న కోటీశ్వరుడు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.