Crime News : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ ఇద్దరి మరణానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువర్గాలను ఆపే క్రమంలో మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో పాత కక్షలు, ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఇరువర్గాల మధ్య మరోసారి పెద్ద గొడవ జరిగింది. ఒకరిని ఒకరు దూషించుకున్నారు. వివాదం మరింత ముదరడంతో సైదా కుమారుడు రాము అక్కడికి వచ్చి గొడ్డలితో మంద వెంకటేశ్వర్లు (62),పై దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన రాము తండ్రి సైదా (58)పై కూడా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Also Read : విశాఖలో దారుణం.. భార్య పిల్లలకు విషమిచ్చి… తాను ఉరివేసుకుని..

ఈ హత్యల గురించి తెలుసుకున్న ఇరువర్గాల కుటుంబాలు అక్కడికి చేరుకుని ఘర్షణకు దిగారు. దీంతో రాము ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు వర్గీయులు రాము ఇంటిపై దాడికి దిగారు. రాళ్లతో ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఘర్షణ విషయం తెలిసి మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తన సిబ్బందితో వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్న రామును అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు నవీన్ కుమార్ ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డకున్నారు. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో ఎస్ నవీన్ కుమార్ తలకు తీవ్ర గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతరం రామును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.జ

కాగా, ఇరువర్గాల మధ్య ఉన్న పాత కక్షలు కూడా ఈ ఘర్షణకు కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు, దాడి జరిగిన తీరు, నిందితుడి గత ప్రవర్తనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు పెద్దబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేప చెట్టు వివాదం నేపథ్యంలో జరిగిన హత్యలతో ఎర్రగడ్డ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Also Read : నా పరువు తీస్తోంది చంపేయ్​ : ప్రియుడితోనే బిడ్డను చంపించిన తండ్రి!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.