NEET : దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణపై తీవ్ర నమ్మకం సడలిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ చట్టానికి మరింత పదును పెడుతూ ప్రతిపాదించిన సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితో ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత మోసాలకు పాల్పడే ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సర్వసిద్ధమైంది. ఈ కొత్త చట్టసవరణ ద్వారా శిక్షల తీవ్రతను న భూతో న భవిష్యతి అన్న చందంగా పెంచారు. ఇకపై పరీక్షా పత్రాల లీకేజీలకు పాల్పడినా లేదా అక్రమాలకు సహకరించినా గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా కఠిన నిబంధనలను రూపొందించారు. అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : నీట్ లీకేజీ వ్యవహారం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు –కేంద్రానికి నోటీసులు

యువతకు హామీనీట్, జేఈఈ వంటి జాతీయ పరీక్షల్లో తలెత్తిన వివాదాలపై విద్యార్థి లోకం పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “దేశ యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు” అని స్పష్టం చేసిన ప్రధాని, కఠిన చట్టాన్ని తీసుకువస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ‘పేపర్ లీక్ కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగకుండా ఉండేందుకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టమైన నిబంధన చేర్చారు. కేసు నమోదు అయిన నాటి నుండి విచారణ ప్రారంభించి, కేవలం 3 నెలల వ్యవధిలోనే విచారణ ముగించి తుది తీర్పుతో దోషులకు శిక్ష ఖరారు చేసేలా అధికారాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో తొలి ఫాస్ట్-ట్రాక్ కోర్టును ప్రకటించగా, మరో నాలుగు కోర్టులను త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

Also Read : ఎల్‌నినోను తొక్కిపడేసిన PDO.. గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. కారణమిదే!

జూన్ 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం వ్యక్తిగత నేరాలకు 3-5 ఏళ్ల జైలు, రూ.10 లక్షల వరకు జరిమానా ఉండేది. వ్యవస్థీకృత నేరస్థులకు 5-10 ఏళ్ల జైలు, రూ.1 కోటి జరిమానా ఉండేది. అయితే ప్రస్తుత సవరణల ద్వారా సాధారణ,వ్యవస్థీకృత నేరస్థులందరికీ శిక్షల కాలాన్ని,జరిమానా మొత్తాన్ని గరిష్ట స్థాయికి (రూ.10 కోట్లు) పెంచడం గమనార్హం. నష్టపరిహారం & కేసుల ఎత్తివేతవిద్యార్థులు ,తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, నీట్ అక్రమాల వల్ల తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. అదేవిధంగా, విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించిన ఏ ఒక్క విద్యార్థిపై కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది.

కేబినెట్ ఆమోదం పొందిన ఈ ముసాయిదా చట్టసవరణ బిల్లును వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. విపక్షాలు లేవనెత్తుతున్న విమర్శలకు సభలోనే పారదర్శకంగా సమాధానమిస్తూ, విద్యాసంస్కరణలపై సమగ్ర చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభ్యర్థులలో మళ్లీ నమ్మకాన్ని నింపేలా ఉన్నాయి. కఠిన శిక్షలు, మూడెనెలల పరిమితి కలిగిన ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా భవిష్యత్తులో ఏ పరీక్షలోనూ అక్రమాలు జరగకుండా నిరోధించవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.