Supreme Court Raises Big Question on Reservation
Supreme Court Raises Big Question on Reservation

Supreme Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న తీవ్ర లోపాలకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లు ఇకనైనా చుక్కాని పెట్టాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ, ఈ వ్యవహారంపై చేపట్టిన చర్యలపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

తాత్కాలిక సర్దుబాట్లు లేదా పైపైన చర్యలతో సమస్య ముగిసిపోదని, శాశ్వత వ్యవస్థాగత సంస్కరణలు ఎలా అమలు చేస్తున్నారో వివరిస్తూ కేంద్రం, ఎన్టీఏలు ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పేపర్ లీక్ నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారో సునిశితంగా పరిశీలిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి స్థాయి భద్రత కల్పించే విధానం రూపుదిద్దుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.

పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో 10 ప్రధాన రంగాల వారీగా పూర్తి వివరాలు అందించాలని కోర్టు ఆదేశించింది. పరీక్ష జరగడానికి ముందు (Pre-exam), పరీక్ష సమయంలో (During exam), పరీక్ష ముగిసిన తర్వాత (Post-exam) ఎలాంటి మార్పులు తెచ్చారో స్పష్టం చేయాలంది. ఇందులో ముఖ్యంగా డిజిటల్ మౌలిక వసతులు, పరిశోధన, పారదర్శకత, పరిపాలనా విభాగాలు, మానవ వనరుల సమర్థవంతమైన వినియోగం వంటి అంశాలు ఉన్నాయి.

పరీక్షా పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళం (IAF) సేవలను ఉపయోగించడంపై జస్టిస్ పి.ఎస్. నరసింహ వ్యాఖ్యానిస్తూ, ఇది కేవలం తాత్కాలిక నివారణ చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. సైన్యం లేదా వైమానిక దళాన్ని ఉపయోగించడం శాశ్వత పరిష్కారం కాదని, పరీక్షల భద్రత కోసం బలమైన, స్వతంత్రమైన సాంకేతిక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మాసనం గుర్తుచేసింది.

Also Read : ఎల్‌నినోను తొక్కిపడేసిన PDO.. గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. కారణమిదే!

భవిష్యత్తులో నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తామని తెలిపిన నేపథ్యాన్ని కోర్టు ప్రస్తావించింది. ఆన్‌లైన్ విధానంలోకి మారేందుకు ఎలాంటి మార్పులు చేస్తున్నారు? సైబర్ సెక్యూరిటీ, అభ్యర్థుల డేటా భద్రత కోసం తీసుకుంటున్న పటిష్ఠ చర్యలు ఏంటి? అనే వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచాలని కోరింది.

పరీక్ష కేంద్రాల వద్ద నకిలీ అభ్యర్థుల (Impersonation) నివారణకు,అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు విమానాశ్రయాల్లో వాడే ‘డిజీయాత్ర’ (DigiYatra) వంటి ఆధునిక బయోమెట్రిక్ సాంకేతికతలను ఉపయోగించే ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వాలని కోర్టు కోరింది. దీనివల్ల ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

పరీక్షల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయబోయే గవర్నింగ్ బోర్డు, నిపుణుల కమిటీల పురోగతిని కోర్టు ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. విద్యార్థుల ప్రయోజనాల కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు. ధర్మాసనం ఇందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.

కేవలం ఒకట్రెండు విచారణలతో ఈ వ్యవహారాన్ని ముగించకుండా, నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల సంస్కరణలను ఏడాది పొడవునా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు అత్యంత కీలక ప్రకటన చేసింది. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత తిరిగి నెలకొల్పే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ, ఈ కేసు తదుపరి విచారణను జులై 27 (సోమవారం) నాటికి వాయిదా వేసింది.

Also Read : న్యూఢిల్లీలో హైడ్రామా..రాజ్‌ఘాట్‌కు వెళ్లకుండా ప్రతిపక్ష నేతల అడ్డగింత..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.