
విశాఖపట్నం తీరంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో వీరంతా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ గల బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరం దాటిన తర్వాత సుమారు 50 మైళ్ల దూరంలో ఉన్న పూడిమడక పరిసర ప్రాంతాల్లో వీరు తమ వేటను కొనసాగించినట్లు సమాచారం.
వాతావరణం అనుకూలించకపోవడంతో మత్స్యకారులు తిరిగి హార్బర్‌కు వచ్చేందుకు నిర్ణయించుకున్నా రు. జులై 4వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పారు. చివరిసారిగా మాట్లాడిన సమయంలో తాము గంగవరం పోర్టు సమీపంలో ఉన్నామని వారు పేర్కొన్నారు. అయితే, వారు చెప్పిన సమయం దాటినా, సాయంత్రం 5 గంటలైనా బోటు తీరానికి రాకపోవడం(Seven Fishermen Missing) తో ఆందోళన మొదలైంది.
తీరానికి వస్తామని చెప్పిన మత్స్యకారుల నుంచి శనివారం సాయంత్రం 4.30 గంటల తర్వాత ఎలాంటి సమాచారమూ అందలేదు. వారి వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయి, ‘స్విచ్ ఆఫ్’ వస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వాతావరణ పరిస్థితులపై కుటుంబ సభ్యులు ముందే అప్రమత్తం చేసినప్పటికీ, వారు ప్రమాదంలో చిక్కుకోవడంతో ఏం జరిగిందో తెలియక కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు విశాఖపట్నం జిల్లా, భీమిలి మండలం, పెద నాగమయ్య పాలేనికి చెందిన మత్స్యకారుడు. ప్రస్తుతం వీరి కుటుంబాలన్నీ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నాయి. ఈ బోటును యజమాని కారి చిన్నయ్య ఏడాది క్రితమే కొనుగోలు చేయగా, ఆయనే డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు తన అల్లుడు, అన్నయ్య కుమారులతో కలిసి వేటకు వెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఇందులో ఉండటం మరింత కలచివేస్తోంది.
గల్లంతైన మత్స్యకారుల జాబితా:
అప్పలరాజు
బండియ్య
గరగయ్య
సీతుడు
చిన్న అమ్మోరు
కారి చిన్న
కారి చిన్నయ్య (బోటు యజమాని)
Also Read : ఏలూరు జిల్లాలో ఘోర రైల్వే ప్రమాదం: రైలు ఢీకొని నలుగురు దుర్మరణం?
మత్స్యకారులతో సంబంధాలు తెగిపోవడంతో మరపడవల ఆపరేటర్ల సంఘం, బోటు ఓనర్స్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరామ్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాద సమాచారాన్ని ఆయన జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులు, విశాఖ మెరైన్ పోలీసులకు చేరవేశారు. దీనితో భారత కోస్ట్ గార్డ్ (Coast Guard), ఇండియన్ నేవీ, మెరైన్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి సముద్రంలో భారీ స్థాయిలో ఉమ్మడి రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేయగా, సముద్రంలో గల్లంతైన బోటులోని వారిలో ఒకరు సురక్షితంగా దొరికినట్లు తాజా సమాచారం అందుతోంది. బోటు యజమాని కారి చిన్నయ్యను కోస్ట్ గార్డ్ సిబ్బంది విజయవంతంగా కాపాడారు. అయితే, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఒకరు సురక్షితంగా బయటపడినప్పటికీ, మిగిలిన వారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద విషాద వాతావరణం అలుముకుంది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ హార్బర్ వద్దే వేచి చూస్తున్నారు. ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు అధునాతన సాంకేతికత, బోట్లతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేశాయి. అల్పపీడన తీవ్రత కారణంగా సముద్రంలో అలల వేగం ఎక్కువగా ఉన్నప్పటికీ, మిగిలిన ఆరుగురు మత్స్యకారులను కూడా క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.
Also Read : కేతన్ హత్య కేసులో కీలకంగా మారిన గెయిట్ అనాలసిస్..! ఎందుకంటే ?









