
నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో ఆయన కుమార్తె జనని వివాహం ఆగస్టు 16వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. వీరి వివాహ వేడుకకు హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. అయితే తాజాగా బండ్ల గణేష్ ముద్రించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో ఉన్న పేర్లు చూసి పవన్ కల్యాణ్ అభిమానులు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ కార్డులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పెళ్లి కార్డులపై దేవుళ్ల పేర్లు లేదా ఇంటి పెద్దల పేర్లు ముద్రించడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయితే బండ్ల గణేష్ మాత్రం తన కూతురి పెళ్లి కార్డుపై ఆసక్తికరంగా సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పేర్లను ముద్రించారు. ‘‘శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో..’’ అంటూ పెళ్లి కార్డుపై రాయించారు. ఇందులో భాగంగా మొదటి వివాహ పత్రికను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచగా.. రెండో పత్రికను స్వయంగా నారా భువనేశ్వరికి అందించి ఆహ్వానించారు.
Bandla Ganesh Daughter Wedding Invitation pic.twitter.com/4bgdkKyb9o
— Journalist Nishant (@NishantOpinions) July 6, 2026
అందుకు సంబంధించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెట్టింట చర్చ మొదలైంది. పత్రికపై కేవలం చంద్రబాబు నాయుడి దంపతుల పేర్లు ఉండటం.. పవన్ కల్యాణ్ పేరు లేకపోవడంతో జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..’’ అంటూ పవన్ కల్యాణ్‌ను ఎంతగానో అభిమానించి, ఆరాధించిన బండ్ల గణేష్ ఇప్పుడు చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక బలమైన కారణమే ఉందంటూ.. సినీ, రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు బండ్ల గణేష్.. పవన్ కల్యాణ్‌కు వెన్నుపోటు పొడిచారంటూ నెట్టింట కామెంట్లు రచ్చ రచ్చ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే నారా కుటుంబంతో బండ్ల గణేష్‌కు చాలా కాలంగా వ్యక్తిగత అనుబంధం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన క్షేమంగా జైలు నుంచి బయటకు వస్తే తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారు. అనుకున్నట్లుగానే చంద్రబాబు బయటకు రాగానే షాద్ నగర్ నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నారు. అంతేకాకుండా.. ఇటీవలే బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు స్వయంగా హాజరై వధూవరులను దీవించారు. అందుకే నారా ఫ్యామిలీని తమ కుటుంబ పెద్దలుగా భావించి వారి పేర్లను పత్రికపై వేయించారని సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.









