
Gait analysis : పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు (Ketan Agarwal Murder Case) దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తుండటంతో, నిందితులను చట్టం ముందు నిలబెట్టేందుకు పుణె పోలీసులు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌ను ఆశ్రయించారు. జూన్ 18న జరిగిన ఈ ఘోర హత్యకు సంబంధించి నిందితులైన చేతన్ చౌదరి, సియా గోయల్‌లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా లోహ్‌గఢ్ కోట పరిసరాల్లో సీన్ రీక్రియేషన్ (Scene Recreation) నిర్వహించారు. ఆదివారం నిందితురాలు సియా గోయల్‌ను నేరం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు, సోమవారం మరో నిందితుడు చేతన్ చౌదరిని కూడా అక్కడికి తీసుకెళ్లి ఘటన ఎలా జరిగిందనే దానిపై వివరాలు సేకరించారు.
ఏంటీ ‘గెయిట్ అనాలసిస్’?
హత్య జరిగిన రోజున ఘటనా స్థలానికి సమీపంలో ఒక వ్యక్తి తలకు హుడీ (క్యాప్) ధరించి అనుమానాస్పదంగా తిరగడాన్ని సీసీటీవీ ఫుటేజీల్లో పోలీసులు గమనించారు. అతడు చేతన్ చౌదరి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో కోర్టులో ఇది బలమైన ఆధారంగా నిలవదనే ఆందోళన ఉంది. దీంతో ఈ కేసులో అత్యంత కీలకమైన గెయిట్ అనాలసిస్ (Gait Analysis) చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఫోరెన్సిక్ సైన్స్‌లో ఒక వ్యక్తి నడిచే తీరును విశ్లేషించడాన్ని ‘గెయిట్ అనాలసిస్’ అంటారు. లోహ్‌గఢ్ కోటలో నిందితుడు చేతన్‌తో చేసిన సీన్ రీక్రియేషన్ వీడియోలను, హత్య జరిగిన రోజు రికార్డైన సీసీటీవీ ఫుటేజీలతో ఫోరెన్సిక్ నిపుణులు పోల్చి చూడనున్నారు.
మనుషుల ఎత్తు, శరీరాకృతి ఒకేలా ఉన్నప్పటికీ.. వారి అడుగుల మధ్య దూరం, శరీర భంగిమ, చేతుల కదలిక, కండరాల నిర్మాణం, పాత గాయాల ఆధారంగా ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన నడక శైలి ఉంటుంది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సహాయంతో సీసీటీవీ ఫుటేజీలోని ప్రతి ఫ్రేమ్‌ను, నిందితుడి నడకను పోల్చి చూస్తారు. అయితే, వేలిముద్రలు (Fingerprints), డీఎన్‌ఏ (DNA) తరహాలో దీనిని వంద శాతం కచ్చితమైన ఆధారంగా పరిగణించకపోయినా, నిందితుడి ఉనికిని నిరూపించడానికి కోర్టులో ఇది బలమైన కొలాటరల్ ఎవిడెన్స్‌గా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటికే కోర్టుకు కూడా వివరించారు.
కేతన్ ఫోన్ సియా వద్దే.. డేటా డిలీట్ చేశారా?
దర్యాప్తులో భాగంగా పోలీసులకు మరో షాకింగ్ నిజం తెలిసింది. కేతన్ అగర్వాల్ చనిపోయిన తర్వాత అతని మొబైల్ ఫోన్ కొన్ని రోజుల పాటు నిందితురాలు సియా గోయల్ (Siya Goyal) వద్దే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే ఆమె ఆ ఫోన్‌ను మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో, కేతన్ ఫోన్ తన దగ్గర ఉన్న రోజుల్లో సియా అందులోని కీలకమైన డేటాను ఏమైనా డిలీట్ చేసిందా? హత్యకు గల కారణాలు, చాటింగ్‌లు లేదా ఫొటోలు వంటి ఏవైనా ఆధారాలను తారుమారు చేసిందా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అవసరమైతే డిలీట్ అయిన డేటాను రికవర్ చేసేందుకు ఫోన్‌ను సైబర్ లాబ్‌కు పంపే యోచనలో ఉన్నారు.
మూడో వ్యక్తి హస్తం ఉందా?
ఈ దారుణ హత్య కేవలం సియా, చేతన్‌లు మాత్రమే ప్లాన్ చేశారా.. లేక వీరికి వెనుక ఉండి ఎవరైనా సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. నిందితుల కాల్ డేటా, లోహ్‌గఢ్ కోట పరిసరాల్లోని మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా ఈ కేసులో మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.









