Census 2027 : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనగణనతో పాటే సమగ్ర కుల గణనను కూడా చేయాలని నిర్ణయించింది.

స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా జరగనున్న సమగ్ర కుల గణన కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో పౌరులను అడిగేందుకు గాను సిద్ధం చేసిన 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. జనగణన కోసం కేటాయించిన ప్రశ్నావళిలో 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీ, కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక అవకాశం ఇచ్చారు.

ఇక ఈసారి జనగణన అంతా డిజిటలైజ్‌ విధానంలో కొనసాగనుంది. అంటే దేశంలోనే తొలిసారిగా యాప్‌లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరించనున్నారు. దీనికోసం పౌరులు15 రోజుల పాటు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. కాగా కేంద్రం రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో జనగణన-2027ను రెండు దశల్లో నిర్వహించనుంది. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు.

ఇక రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణను పూర్తి చేయనున్నారు. జనగణనలో పౌరులు తెలిపే వ్యక్తిగత వివరాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. సెన్సస్ యాక్ట్, 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రక్షణ ఉంటుందని పేర్కొంది.

Also Read : విలీనం దిశగా ఉబర్‌- రాపిడో అడుగులు? చివరి నిమిషంలో…

ఈ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి..

ఇక హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. దీనికోసం జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిలో కులం, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వంటి కీలక అంశాలు ఉన్నాయి. మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను కూడా లెక్కించి జాబితా రూపొందిస్తారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘రిజిస్ట్రార్‌ జనరల్ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా’ పర్యవేక్షణలో ఈ జనాభా లెక్కల కార్యక్రమం జరగనుంది.

ఈ ప్రాంతాలలో జనాభా గణన సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరుగనుండగా,  అంతకుముందే, ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవరకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకునేందుకు వీలుగా ‘సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’ (ఎస్‌ఈ) పోర్టల్‌ను, జనగణనకు సంబంధించి పరిపాలనా పరమైన పర్యవేక్షణకు ఉపయోగపడే సెన్సస్‌ మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

Also Read : హైదరాబాద్‌లో 65 అంతస్తుల ట్రంప్ టవర్స్.. ప్రత్యేకతలేంటో తెలిస్తే షాక్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.