Bab al-Mandeb Strait : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. చమురు రవాణాకు ముఖ్యమైన బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధి లోని నౌకపై హూతీలు (Houthis) దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు యెమెన్ తీరరక్షక దళం వెల్లడించడం గమనార్హం. మృతులను పాకిస్థాన్‌, ఇండోనేషియాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారి వివరాలు తెలియాల్సి ఉంది. టాంజానియా జెండా కలిగిన కార్గో నౌక ఒమన్‌ నుంచి జిబౌటి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడి పై హూతీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read : సిరియా కోర్టు సంచలన తీర్పు… మాజీ అధ్యక్షునితో పాటు మరో ఇద్దరికీ మరణశిక్ష

చమురు రవాణాలో మాండెబ్‌ జలసంధి చాలా ముఖ్యమైంది. ఇది యెమన్, జిబౌటి మధ్య ఉంది. ఈ సంధి ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్‌ కాలువ దిశగా ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది ప్రధానమైన కీలక మార్గం. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12 శాతం చమురు దీని ద్వారానే పయనిస్తుంటుంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్‌ఎన్‌జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతుంటాయి. కాగా, ఈ జలసంధి గుండా ఏటా రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరకులు రవాణా అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బాబ్‌ అల్‌ మాండెబ్‌లో హూతీల డాదులతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడులు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో ఈ ప్రాంతంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : జిన్నా చేసిన నమ్మకద్రోహం.. బలూచిస్తాన్‌ను బలితీసుకున్న పాకిస్తాన్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.