Assam : అస్సాంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైలాకాండి జిల్లాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన సమయంలో ఈ రాక్షస క్రీడ చోటుచేసుకుంది. మృతురాలి ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం చేసి, అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన తీరు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Also Read : ప్రియుడి మోజులో.. 6 నెలల కొడుకుని చంపిన కసాయి తల్లి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్లిచెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలోయిచోరా ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లినప్పటికీ, అక్కడ ఒక కజిన్‌తో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆమె ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి, ఆ బాలిక రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఆమె తల, ముఖాన్ని తీవ్రంగా కొట్టి నుజ్జునుజ్జు చేయడంతో పాటు, శరీరంపై దారుణమైన గాయాలతో ఆమెను గుర్తుపట్టలేని స్థితిలో వదిలివెళ్లారు.

ఈ దారుణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, హత్యకు ముందు బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించారు. ఈ అమానుష ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవే 6పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమితాబ్ సిన్హా తెలిపారు. కుటుంబ సభ్యులు లైంగిక దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నప్పటికీ, మెడికల్ పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఆ విషయాలు పూర్తిగా స్పష్టమవుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును తీవ్రతరం చేశారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.. ట్విస్ట్‌ ఏంటంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.