Rega Kanta Rao : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుచట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, వ్యక్తిగత ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని, లైంగికంగా వేధించారంటూ భద్రాద్రి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి ఓ హాస్టల్‌లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌లో పనిచేస్తోంది. 2022లో తన 18 ఏళ్ల వయస్సులో ఉద్యోగం కోసం కాంతారావును కలవగా, ఆయన కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభిస్తున్నానని చెప్పి ఫ్లాట్‌కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అడ్డుకోగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి అమీర్‌పేటలోని ఓ నటుడి ఫ్లాట్‌లో నివాసం ఉంచి ఆమెతో సహజీవనం కొనసాగించారు. కొన్నాళ్లకు కాంతారావు ప్రవర్తన సరిగ్గా లేదని గ్రహించిన యువతి ఆయనను దూరం పెట్టగా, ఇద్దరూ కలిసి ఉన్న వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో ఆమె వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని, తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. 2024 నుంచి బాధితురాలి ఫోన్ నుంచి మరొక అమ్మాయి నంబర్ తీసుకుని ఆమెతో కూడా మాట్లాడటం ప్రారంభించడంతో బాధితురాలు షీటీమ్‌ను ఆశ్రయించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, ఆమె సన్నిహితురాలు కాంతారావు సోషల్‌ మీడియా ప్రతినిధి ప్రవీణ్‌ను సంప్రదించింది. ఆ తర్వాత కాంతారావు సన్నిహితుడు కాంట్రాక్టర్ నూకరపు రమేశ్‌ మార్చిలో రెండు విడతలుగా బాధితురాలికి రూ.8.5 లక్షలు బదిలీ చేశాడు. అయితే కాంతారావు ఈ లావాదేవీల వివరాలను షీ టీమ్‌కు సమర్పించి, సదరు యువతి డబ్బుల కోసం తనను వేధిస్తోందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొనడం గమనార్హం. కాంతారావు తీరుతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఆయనను అంగీకరించానని, ఈ నాలుగేళ్లలో తనను లైంగికంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడని పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలి నుంచి అందిన ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ఆధారంగా పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన అత్యాచారం . మోసం కేసుపై రేగా కాంతారావు వెంటనే స్పందించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : తెలంగాణ పోలీసు శాఖలో భారీ నోటిఫికేషన్: 7,437 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

బాధితురాలి ప్రకటనతో కొత్త ట్విస్ట్‌

అయితే, ఈ వ్యవహారంలో తాజాగా మరొక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. రేగా కాంతారావుపై కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విషయమై బాధిత యువతి మీడియా ముందుకు వచ్చి స్పందిస్తూ.. తాను రేగా కాంతారావుపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొనడం గమనార్హం. తన వివరాలు పోలీసులకు ఎలా వచ్చాయో తనకు తెలియదని, ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె చెప్పడం కేసు తీవ్రతను మరొక మలుపు తిప్పింది.

పొలిటికల్ కెరీర్,భూకబ్జా ఆరోపణలు

రేగా కాంతారావు 2009లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో రెండోసారి కాంగ్రెస్ నుంచే గెలిచినప్పటికీ, ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన అనంతరం మణుగూరులోని కాంగ్రెస్‌ భవాన్ని బీఆర్‌ఎస్‌ భవనంగా మార్చడంతో అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. భట్టి విక్రమార్క, సీతక్క వంటి కాంగ్రెస్ అగ్రనేతలు ఆయన తీరుపై మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు.

ఫారెస్టు భూముల ఆక్రమణ ఆరోపణలు

కాంతారావుపై గతంలో భూకబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. కరకగూడెం భట్టుపల్లి, మణుగూరు ప్రాంతాల్లో సుమారు 70 ఎకరాల అటవీ (ఫారెస్టు) భూములను ఆక్రమించి, వాటికి బినామీ పట్టాలు ఇప్పించారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇలా వరుస వివాదాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో చోటుచేసుకున్నాయి.

Also Read : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.. ట్విస్ట్‌ ఏంటంటే?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ఒక యువతి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం, ఆయన కోర్టును ఆశ్రయించడం,తిరిగి బాధితురాలు తాను ఫిర్యాదు చేయలేదనడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను తేల్చేందుకు పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నిజంగానే మహిళ ఫిర్యాదు చేసిందా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.