
Prayagraj : ప్రయాగ్‌రాజ్ నగరంలో ఉన్న కొత్త యమునా వంతెనపై పగటిపూట జరిగిన ఒక ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట వంతెనపైకి వచ్చారు. ఆ జంట కాసేపు వంతెనపై నిలబడి మాట్లాడుకున్నారు. అంతలోనే ఆ యువకుడు హఠాత్తుగా యమునా నదిలోకి దూకేశాడు. యువకుడు నదిలోకి దూకగానే, అతనితో పాటు ఉన్న యువతి కూడా దూకపోగా, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో వంతెనపై ఉన్న వాళ్లు ఒక్కసారిగా కంగారు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్ సిటీ జోన్‌లోని కీడ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొత్త యమునా వంతెనపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, సదరు యువకుడిని మేజా ప్రాంతానికి చెందిన అన్నూ గుప్తాగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే అతను తన లవర్ తో కలిసి వంతెనపైకి వచ్చినట్లు సమాచారం. యువకుడు నదిలోకి దూకడం చూసి అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : బావతో ఏడుగురు పిల్లల తల్లి జంప్.. భార్య ఆచూకీ కోసం భర్త ఆవేదన!
సమాచారం అందుకున్న వెంటనే కీడ్‌గంజ్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, గజ ఈతగాళ్లు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, ఎంతో శ్రమించి యువకుడిని సురక్షితంగా నదిలో నుండి బయటకు తీశారు. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న యువకుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యలు చేపట్టారు.
యువకుడు క్షేమంగానే ఉన్నాడని, ప్రాథమిక విచారణ, అవసరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ యువతీ యువకులు వంతెనపైకి ఎందుకు వచ్చారు, ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. మొత్తం ఘటనపై పూర్తి స్పష్టత కోసం ఆ యువతిని కూడా వెతికే పనిలో ఉన్నారు. దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చే నిజాలను బట్టి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Also Read : మమతకు మరో షాక్.. నటి రాజీనామా!









