
Thailand : థాయ్‌లాండ్‌కు వెళ్లాలనుకునే ఇండియన్ టూరిస్టుల కోసం ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇండియన్స్ కు 30 రోజుల పాటు వీసా లేకుండానే దేశంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి మే నెలలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల భారతీయ పర్యాటకుల రాక గణనీయంగా తగ్గడం థాయ్‌లాండ్ పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా మారింది. పాత నిబంధనల వల్ల పర్యాటకుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో, వారి ప్రయాణాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త వెసులుబాటును తీసుకువచ్చింది.
Also Read : పాకిస్థాన్కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్!
ప్రస్తుతం భారతీయులకు అమల్లో ఉన్న 60 రోజుల వీసా రహిత ప్రవేశం త్వరలో ముగియనుండటంతో, దాని స్థానంలో ఈ 30 రోజుల కొత్త విధానం అమలులోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా చైనా, మలేషియా తర్వాత థాయ్‌లాండ్‌ను అత్యధికంగా సందర్శించే భారతీయుల ప్రయాణాలను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, ఈ 30 రోజుల వీసా మినహాయింపును యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలకు కూడా వర్తింపజేయడం ద్వారా అంతర్జాతీయంగా పర్యాటక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని థాయ్‌లాండ్ ఆశిస్తోంది.
మరోవైపు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, అక్రమ కార్యకలాపాలపై థాయ్‌లాండ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వీసా రహిత విధానాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుండటాన్ని ప్రభుత్వం గమనించింది. ఇలాంటి చర్యలు స్థానిక వ్యాపారాలకు ముప్పు కలిగిస్తున్నాయని భావిస్తూ, పర్యాటకుల ముసుగులో అక్రమాలకు పాల్పడేవారిపై కఠినమైన నిఘా ఉంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఈ వీసా విధానం వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తే పరిస్థితిని బట్టి ప్రభుత్వం మళ్లీ సమీక్షించే అవకాశం ఉంది.
Also Read : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు: ఇండియన్ మృతి, పలువురికి గాయాలు









