
Bihar : బీహార్లోని సహర్సా జిల్లా సిమ్రీ భక్తియార్పూర్ పట్టణంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లి భోజనంలో మటన్ వడ్డిస్తామని మాటిచ్చి, చీప్ గా చికెన్ వడ్డించారనే చిన్నపాటి కారణంతో రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవ, చివరకు తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. ఈ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన సుమారు 12 మంది గాయపడ్డారు.
Also Read : స్విట్జర్లాండ్ టూర్ పేరుతో రూ. 50 కోట్లకు ఐపీ.. హైదరాబాద్ జంట జంప్!
వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మహమ్మద్ అబ్దుల్లా, మహమ్మద్ జావేద్ కుమార్తె వివాహం ఎంతో ప్రశాంతంగా, అన్యోన్యంగా జరిగింది. అయితే పెళ్లి తంతు ముగిసిన తర్వాత వధూవరుల తరపు వారు కలిసి భోజనానికి కూర్చున్న సమయంలో అసలు గొడవ మొదలైంది. పెళ్లి మెనూలో భాగంగా మటన్ వడ్డిస్తామని వధువు తరపు వారు మాట ఇచ్చారని, కానీ ప్లేట్లలో చికెన్ వడ్డించడంతో వరుడి తరపు బంధువులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే తారాస్థాయికి చేరింది. మాటల యుద్ధం కాస్తా చేతుల కలపడం వరకు వెళ్ళింది. వివాహం జరుగుతున్న ప్రదేశం రణరంగంగా మారింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేయడం, కత్తులు ఊపుతూ భయభ్రాంతులకు గురిచేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ దాడిలో గాయపడిన వారిని స్థానిక సిమ్రీ భక్తియార్పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వేడుకలో కనీసం వంటకం పేరుతో జరిగిన ఈ ఘర్షణ స్థానికంగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read : ఎథనాల్ పెట్రోల్ వెనుక అసలు నిజమేంటి?









