polygamy: అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది. కేవలం చట్టాలు చేయడమే కాకుండా, బహుభార్యత్వాన్ని పాటించే వారిని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసేలా ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా, ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకునే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ప్రకటించి రాష్ట్రంలో సరికొత్త రాజకీయ, సామాజిక సంచలనానికి తెరలేపింది.

2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ అస్సాం రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా బడ్జెట్ ప్రసంగంలో మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. బహుభార్యత్వాన్ని పాటించే వారు ప్రభుత్వ విధుల్లో ఏ స్థాయిలో (ఏ క్యాడర్‌లో) ఉన్నా.. వారిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, ఎక్కువ మందిని వివాహం చేసుకునే వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు కూడా పూర్తిగా అనర్హులని స్పష్టం చేశారు.

ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో బహుభార్యత్వాన్ని పాటించే వారికే కాకుండా సమాజంలో నేరాలకు పాల్పడే వారికి కూడా ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏ రకమైన క్రిమినల్ చట్టం కిందనైనా కోర్టు ద్వారా దోషిగా తేలిన ఏ వ్యక్తికైనా సరే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలను అందించబోమని బడ్జెట్ వేదికగా ఆర్థిక మంత్రి కీలక ప్రతిపాదన చేశారు. నేర రహిత సమాజ స్థాపనకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

అస్సాంలో బహుభార్యత్వాన్ని చట్టబద్ధంగా నిషేధించే దిశగా అసెంబ్లీలో “అస్సాం బహు భార్యత్వ నిషేధ బిల్లు”ను ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సరికొత్త చట్టం ప్రకారం.. వివాహమైన ఏ వ్యక్తి అయినా సరే చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా లేదా మొదటి భార్య/భర్త బతికుండగానే మరో పెళ్లి చేసుకుంటే దానిని తీవ్రమైన నేరంగా (దోషిగా) పరిగణిస్తారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి రెండో వివాహం చేసుకున్న నిందితులకు ఏడేళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు భారీగా జరిమానా విధించేలా న్యాయపరమైన నిబంధనలను రూపొందించారు.

ఈ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఈ చట్టం ఏ మతానికి లేదా ముఖ్యంగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. “నిజమైన ఇస్లాం ఎప్పుడూ బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ముస్లిం సోదరీమణులకు న్యాయం జరుగుతుంది. టర్కీ వంటి ఆధునిక ముస్లిం దేశాలు కూడా బహుభార్యత్వాన్ని ఎప్పుడో నిషేధించాయి, పాకిస్థాన్‌లో కూడా దీనిపై ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఉంది. కాబట్టి నిజమైన ఇస్లామిక్ ప్రజలు ఈ చట్టాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు” అని సీఎం పేర్కొన్నారు.

రాజ్యాంగ రక్షణలను గౌరవిస్తూ, ఈ చట్టం నుంచి అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలకు, షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన సభ్యులకు వారి సాంప్రదాయ కస్టమ్స్, ఆచారాలు , సంస్కృతికి భంగం కలగకుండా ఈ చట్టం నుండి మినహాయింపు కల్పించారు. ఇదే వేదికపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో కీలక శపథం కూడా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి విజయం సాధించిన వెంటనే, మొదటి అసెంబ్లీ సెషన్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC – ఏకరీతి సివిల్ కోడ్)ను తీసుకువస్తామని ప్రకటించడంతో అస్సాం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.