Astra and BrahMos : భారతదేశం దశాబ్దాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులలో ఒకటిగా కొనసాగుతోంది. తన సైనిక బలగాలను ఆధునికీకరించడానికి, వ్యూహాత్మక అవసరాల కోసం విదేశీ సరఫరాదారులపైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో “ఆత్మనిర్భర్ భారత్” నినాదంతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భారత్ కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే దేశంగానే కాకుండా, ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఎగుమతి చేసే ప్రధాన రక్షణ భాగస్వామిగా వేగంగా అవతరిస్తోంది.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ఈ దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ భాగస్వామ్యంతో పాటు, ‘ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ కోఆపరేషన్ అగ్రిమెంట్’ పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో భారత్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ‘అస్త్ర’ క్షిపణి ఎగుమతులకు మార్గం సుగమమైంది. తూర్పు ఆసియా దేశాలకు భారత్ రక్షణ ఆయుధాలను సరఫరా చేయడమనేది మన దేశపు ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో అత్యంత వ్యూహాత్మక పరిణామం.

Also Read : అమెరికా వెళ్లాలనుకునే టెకీలకు షాకింగ్ న్యూస్.. H-1B వీసా స్కామ్‌.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన!

రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “ఎ డికేడ్ ఆఫ్ డిఫెన్స్ రీఫార్మ్స్: ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియాస్ మిలిటరీ ల్యాండ్‌స్కేప్” నివేదిక ప్రకారం, భారత రక్షణ ఎగుమతులు ఊహించని రీతిలో పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2013-14లో రూ. 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు, 2025-26 నాటికి ఏకంగా రూ. 38,424 కోట్లకు చేరడం విశేషం. ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులు, క్షిపణులు, సైనిక సామాగ్రి ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు చేరుతున్నాయి.

ప్రపంచవ్యాప్త ఆయుధ బదిలీలను పర్యవేక్షించే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) డాటాబేస్ ప్రకారం, భారత్ నుంచి ఆర్టిలరీ, యుద్ధనౌకలు, క్షిపణులు ,రాడార్లతో సహా ప్రధాన ఆయుధ వ్యవస్థలను పొందుతున్న దేశాల సంఖ్య 23కు చేరింది. కేవలం కొన్ని దేశాలకు పరిమితం కాకుండా, భారత్ తన రక్షణ ఎగుమతుల పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా విస్తరించింది. ప్రపంచ రక్షణ మార్కెట్‌లో భారత ఆయుధాల నాణ్యత, ఖచ్చితత్వం ప్రధాన ఆకర్షణగా మారాయి.

ఈ ఎగుమతుల వృద్ధిలో ‘అస్త్ర ఎమ్‌కే-1’ (Astra Mk1) క్షిపణి తదుపరి సంచలనంగా మారబోతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ఈ క్షిపణి, భారత్ సొంతంగా తయారు చేసిన మొదటి “బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్” (BVRAAM). 100 కిలోమీటర్లకు పైగా పరిధి ఉన్న ఈ క్షిపణిని అన్ని రకాల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో శత్రు విమానాలను ఛేదించేలా రూపొందించారు. ఇటీవల సుఖోయ్-30 MKI విమానాల ద్వారా జరిపిన ప్రయోగాల్లో దీని స్వదేశీ సీకర్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

మరోవైపు, భారత రక్షణ ఎగుమతుల బ్రాండ్ అంబాసిడర్‌గా ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిలిచింది. భారత్-రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి, ఫిలిప్పీన్స్ , వియత్నాంలతో ఒప్పందాల తర్వాత ఇప్పుడు ఇండోనేషియాకు కూడా విస్తరించింది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో శత్రు లక్ష్యాలపై బ్రహ్మోస్ చూపిన సర్జికల్ ప్రెసిషన్ ,అద్భుత పనితీరు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బ్రహ్మోస్ కొనుగోలుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

భారత్ కేవలం దాడి చేసే క్షిపణులనే కాకుండా, శత్రు దాడుల నుంచి రక్షించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కూడా ఎగుమతి చేస్తోంది. ఇందులో ప్రధానమైనది ‘ఆకాష్’ (Akash) క్షిపణి వ్యవస్థ. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ షార్ట్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ను విదేశాలకు ఎగుమతి చేయగా, దీనిని కొనుగోలు చేసిన మొదటి విదేశీ వినియోగదారుగా ‘ఆర్మేనియా’ నిలిచింది. శత్రువుల ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్ల నుంచి వ్యూహాత్మక ప్రాంతాలను కాపాడడంలో ఆకాష్ అద్భుతంగా పనిచేస్తుంది.

దీనితో పాటు డిఆర్డిఓ రూపొందించిన ‘పినాక’ (Pinaka) మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ కూడా విదేశీ మార్కెట్లలో శరవేగంగా దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా, భారీ స్థాయిలో రాకెట్లను వర్షంలా కురిపించగల పినాక వ్యవస్థను శత్రు సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ కేంద్రాలు , వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. ఆర్మేనియా దేశం పినాక రాకెట్ వ్యవస్థను కూడా భారత్ నుండి పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది.

మిస్సైల్ వ్యవస్థలతో పాటు నావికాదళ ,సముద్ర భద్రతా రక్షణ రంగంలో కూడా భారత్ తన పట్టు సాధించింది. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలైన మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, మైన్మార్, సీషెల్స్, శ్రీలంక ,వియత్నాం దేశాలకు భారత్ తన డోర్నియర్ Do-228 పెట్రోల్ విమానాలు, ఎల్ అండ్ టీ ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు, ఎఫ్‌పివి-300 గస్తీ నౌకలు, శ్యామ, షయేనా యాంటీ-సబ్‌మరైన్ వ్యవస్థలను సరఫరా చేసింది. ఇది సముద్ర భద్రతలో భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టింది.

సైనిక హెలికాప్టర్లు , యుద్ధ వాహనాల విభాగంలోనూ భారత్ ముందంజలో ఉంది. ధృవ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు (ALH), మి-24డి హెలికాప్టర్లను అఫ్గానిస్తాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలకు సరఫరా చేయగా.. ‘WhAP’ ఇంఫాంట్రీ ప్రోటెక్టెడ్ మొబిలిటీ వాహనాలను మొరాకోకు ఎగుమతి చేసింది. అంతేకాకుండా ATAGS, MArG ఆర్టిలరీ గన్లు, OFB E1 మోర్టార్లు, ,స్వాతి (Swathi) వేపన్ లొకేటింగ్ రాడార్లను ఆర్మేనియా, బంగ్లాదేశ్, మైన్మార్ దేశాలకు విక్రయించింది.

Also Read : ‘యూజీసీ నెట్’ పేపర్ లీకు…రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఈ రక్షణ ఎగుమతుల ప్రయాణంలో భారత్‌కు ‘ఆర్మేనియా’ అత్యంత కీలకమైన, అతిపెద్ద భాగస్వామిగా మారింది. 2020లో జరిగిన నగోర్నో-కరాబాఖ్ యుద్ధం తర్వాత రష్యాపై ఆధారపడటం తగ్గించుకున్న ఆర్మేనియా, తన రక్షణ అవసరాల కోసం భారత్‌ను ఎంచుకుంది. యూఎస్ మిలిటరీ అకాడమీ నివేదికల ప్రకారం, 2022-2024 మధ్య కాలంలో ఆర్మేనియా దిగుమతి చేసుకున్న మొత్తం ఆయుధాలలో 43 శాతం ఒక్క భారతదేశం నుంచే వెళ్లడం విశేషం.

చివరగా, అంతర్జాతీయంగా వస్తున్న భౌగోళిక-రాజకీయ మార్పులు , భారత్ సాధిస్తున్న సాంకేతిక స్వయంసమృద్ధి కలిసి మన రక్షణ రంగాన్ని నూతన శిఖరాలకు చేరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన, సరసమైన ధరల్లో లభించే నాణ్యమైన ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుండటంతో.. రాబోయే రోజుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధ వ్యవస్థలు ప్రపంచ భద్రతలో మరింత కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.