అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే టెక్ నిపుణులకు ముఖ్యమైన H1B వీసా, PERM వర్క్ వీసాల దుర్వినియోగంపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఈ వీసా ప్రోగ్రామ్‌లో జరుగుతున్న భారీ మోసాలు, అక్రమాలను అణచివేయడానికి ఓ దర్యాప్తును ప్రకటించినట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ అక్రమ వీసా స్కామ్‌లలో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌తో పాటు పలు పెద్ద పెద్ద కంపెనీల పేర్లు విచారణలో బయటకు వచ్చాయి.

Also Read : స్పేస్‌లోకి హ్యుమన్స్.. బంగాళాఖాతంలో ల్యాండింగ్.. ఇస్రో గగన్‌యాన్ స్కెచ్‌తో ప్రపంచ దేశాలకు సవాల్

అసలు ఏం జరిగింది?

అమెరికా కార్మిక శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డిఎస్పోసిటో ఈ స్కామ్ గురించి కొన్ని విషయాలు తెలిపారు. కొందరు ఎంప్లాయర్లు, లేబర్ బ్రోకర్లు కలిసి నకిలీ అప్లికేషన్లు సృష్టించడం, తక్కువ జీతాలకే విదేశీ కార్మికులను దోపిడీ చేయడం, తప్పుడు పద్ధతుల్లో వీసాలు పొందడం వంటి పెద్ద స్కెచ్‌లు వేసినట్లు పేర్కొన్నారు. ఈ మోసాల వల్ల అమెరికా స్థానిక పౌరులకు దక్కాల్సిన ఉద్యోగాలు కోల్పోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి.. విదేశీ మోసగాళ్లకు కాదని జేడీ వాన్స్ హెచ్చరించారు.

Also Read : పవిత్ర కర్బలా నగరంలో కన్నీటి సముద్రం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు నేడే!

ఈ వీసా స్కామ్‌లకు సంబంధించి ప్రభుత్వానికి కొందరు విజిల్‌బ్లోయర్స్ కీలక ఆధారాలు అందించారు. అందులో కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం లభించే H-1B వీసాల కోటాను ఈ పెద్ద కంపెనీలే తప్పుడు మార్గాల్లో ల్యాటరీ సిస్టమ్ ద్వారా ఎక్కువగా దక్కించుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడానికి ఇప్పటికే అమెరికా అధికారులు సదరు కంపెనీలకు కోర్టు నోటీసులు కూడా జారీ చేశారు.

అమెరికా జారీ చేసే మొత్తం H-1B వీసాల్లో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 71% భారతీయులకే లభించాయి. దీంతో అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. దీంతో కాగ్నిజెంట్ వంటి కంపెనీల ద్వారా అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులపై, అక్కడి సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మోసాలకు పాల్పడే ఏ ఒక్క సంస్థను వదిలిపెట్టేది లేదని అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.