Meta Instagram Notice : ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న అభ్యంతరకర కంటెంట్, ప్రకటనల (యాడ్స్) వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన ‘మెటా’ (Meta) కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కీలక ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు పంపింది.

ఈ నోటీసు ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక వేధింపులకు (CSEAM) దారితీసే అన్ని రకాల ప్రకటనలను, వివాదాస్పద కంటెంట్‌ను తక్షణమే నిలిపివేసి, పూర్తిగా తొలగించాలని కేంద్రం స్పష్టం చేసింది. అసలు ఇటువంటి అసాంఘిక, అభ్యంతరకరమైన ప్రకటనలను ఇన్‌స్టాగ్రామ్ మోడరేషన్ సిస్టమ్ ఎలా అనుమతించిందో చెప్పాలని ఐటీ మంత్రిత్వ శాఖ నిలదీసింది.

అంతేకాకుండా, ఇటువంటి కంటెంట్‌ను అడ్డుకోవడంలో ఇన్‌స్టాగ్రామ్ భద్రతా వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయనే విషయాలపై 7 రోజులలోగా పూర్తి స్థాయి వివరణాత్మక, సమగ్ర నివేదికను సమర్పించాలని మెటా సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా సరైన సమాచారం అందించడంలో విఫలమైతే సమాచార సాంకేతిక చట్టం (IT Act), పోక్సో చట్టం (POCSO Act), 2012 లోని కఠినమైన నిబంధనల ప్రకారం మెటా సంస్థపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్రం తీవ్రంగా హెచ్చరించింది.

Also Read : 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. వాడివేడిగా సభ?

ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘బీబీసీ’ ప్రచురించిన ఒక సంచలన పరిశోధనాత్మక కథనం. భారతదేశంలోని ఇన్‌స్టా ఖాతాలలో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉండే కంటెంట్‌‌కు సంబంధించిన ప్రకటనలు దర్శనమిచ్చాయంటూ బీబీసీ ఆధారాలతో సహా ఆరోపించింది. ఒళ్లు గగురుపొడిచే రీతిలో ఉన్న ఈ యాడ్స్ పలు టెలిగ్రామ్ ఛానళ్లకు సంబంధించినవని, కేవలం 99 రూపాయలకే ఇటువంటి బాలల అశ్లీల కంటెంట్ లభిస్తుందంటూ ఇన్‌స్టాలో ప్రమోట్ చేస్తున్నట్లు ఆ కథనంలో బయటపెట్టింది.

ఈ అసాంఘిక కంటెంట్‌ను మరింత మంది యూజర్లకు చేరవేసేలా ఇన్‌స్టాగ్రామ్ ‘అల్గారిథమిక్ యాంప్లిఫికేషన్’ (Algorithmic amplification) విధానం పనిచేస్తోందని, దీనివల్ల భద్రతా చర్యలలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని బీబీసీ ఆరోపించింది.

ఈ పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై మెటా అధికారులను పిలిపించి సమగ్రంగా విచారించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మెటాకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, ఇటువంటి కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

Also Read : మమతకు మరో భారీ షాక్: అన్ని పదవులకూ కీలక నేత రాజీనామా!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.