మహారాష్ట్రలోని పుణే నగరంలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం మరువకముందే.. ఆ కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువ రియల్టర్ కేతన్ అగర్వాల్(Ketan Agarwal) (26) దారుణ హత్యకు గురైనప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆయన తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మనవడి హఠాన్మరణం తర్వాత ఆయన మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. గతంలో ఆయనకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది. కేతన్ మరణం తర్వాత ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారడంతో కుటుంబసభ్యులు ఆయనను పుణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ, శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

దేవీచంద్ అగర్వాల్ 2008లో ‘సక్సెస్ గ్రూప్’ అనే ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. సుమారు రూ. 600 కోట్ల ఆస్తి కలిగిన ఈ సంస్థకు కేతన్ అగర్వాల్ డైరెక్టర్‌గా వ్యవహరించేవారు. తన తండ్రిని కూడా కోల్పోవడంతో కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ‘మిస్ యూ డాడ్’ అంటూ పెట్టిన భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను కన్నీటి పర్యంతం చేస్తోంది. దారుణమైన నేరాల వల్ల ఒక ప్రాణం మాత్రమే కాదు, ఒక కుటుంబం మొత్తం ఎలా నాశనమవుతుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌.. మెటాకు కేంద్రం వార్నింగ్‌

అసలేం జరిగింది? హత్యానంతరం బయటపడ్డ షాకింగ్ నిజాలు
జూన్ 18న పుణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద లోయలో పడి కేతన్ అగర్వాల్ మృతి చెందాడు. మొదట దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించినప్పటికీ, పుణే రూరల్ పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన దారుణ హత్యగా తేలింది. కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి లోహగడ్‌ కోట దగ్గర కేతన్‌ను లోయలోకి తోసి ప్రాణాలు తీశారని పోలీసులు నిర్ధారించారు.పోలీసుల దర్యాప్తులో నిందితులు చెప్పిన నిజాలు విస్తుపోయేలా ఉన్నాయి. సియా గోయల్‌కు కేతన్‌ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అయితే, నిశ్చితార్థం తర్వాత పెళ్లిని రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించిన ఆమె, ఎలాగైనా కేతన్‌ను వదిలించుకోవాలని తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఈ దారుణానికి కుట్ర పన్నింది.

హత్యకు ముందు నిందితులిద్దరూ కేతన్‌ను ఎలా చంపాలో గూగుల్, యూట్యూబ్‌లలో విస్తృతంగా వెతికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రకరకాల మార్గాలను పరిశీలించిన తర్వాత, చివరకు కోట పైనుంచి లోయలోకి తోసేయడమే సులభమైన మార్గమని, దీనివల్ల ప్రమాదంగా చిత్రీకరించవచ్చని వారు నిర్ణయించుకున్నారు.ఈ ప్లాన్ ప్రకారం, హత్యకు ముందు వారు లల్లానగర్ మైదానంలో రిహార్సల్స్ కూడా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో ఆధారాలు లభించాయి. ఆ తర్వాత ప్లాన్ అమలు చేయడానికి లోహగఢ్ కోటపై డమ్మీతో పోలీసులు సీన్ రీక్రియేషన్ కూడా చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు వారికి జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నారు. ఈ దారుణ ఘటనపై సియా తండ్రి ప్రవీణ్ గోయల్ స్పందించేందుకు నిరాకరించారు.ప్రస్తుతం పూణే రూరల్ పోలీసులు ఈ కేసుపై అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు. కాబోయే భార్య చేసిన మోసానికి ఒక యువ వ్యాపారవేత్త బలికావడమే కాకుండా, ఆ బాధతో కుటుంబ పెద్ద కూడా మరణించడంతో అగర్వాల్ కుటుంబం కోలుకోలేని శోకసముద్రంలో మునిగిపోయింది. నిందితులకు కఠినమైన శిక్ష పడాలని కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : మమతకు మరో భారీ షాక్: అన్ని పదవులకూ కీలక నేత రాజీనామా!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.