
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆది, సోమవారాల్లో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల మీదుగా నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయి. దీనివల్ల రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఉత్తర, పశ్చిమ తెలంగాణ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఆదివారం పిడుగులు, ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు (అలర్ట్) జారీ చేసింది.భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలతో పాటు, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం దాదాపు 75 శాతం కంటే ఎక్కువగా ఉండనుండటంతో వాతావరణం చల్లబడింది. పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలుల కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Also Read : విశాఖ తీరంలో అల్పపీడన అలజడి.. సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రోజంతా ముసురు వాన పడగా, ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్, రాత్రి వేళల్లో కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ముసురు వానలు పడ్డాయి. శనివారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 5.4 సెం.మీ, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ 3.4 సెం.మీ వర్షం కురిసింది.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లిలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇదే జిల్లాలోని సిర్పూర్ (టి) లో 3.8 సెం.మీ, వాంకిడిలో 3.8 సెం.మీ వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం చాప్రాలలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయని, ఆదివారం కూడా ఇవే పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 75 వేల క్యూసెక్కులకు చేరగా.. ఆదివారం ఉదయానికి ఇది మరింత పెరిగి లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు జిల్లాలోని ప్రసిద్ధ బొగత జలపాతం సరికొత్త కళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చి, జలపాతం వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఏపీలో కూడా తీవ్ర అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మేఘవృతమైన వాతావరణంతో పాటు, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు.రెండు రాష్ట్రాల్లోనూ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల చెంత, భారీ హోర్డింగ్స్ (ఫ్లెక్సీలు) వద్ద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Also Read : కేటీఆర్ కన్నెపల్లి సందర్శనకు అడుగడుగున అడ్డంకులు…జాతీయ రహదారిపై హైడ్రామా









