
Raju Weds Rambai : ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక డెలివరీ బాయ్‌పై జరిగిన భౌతిక దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj), ఒక సామాన్య డెలివరీ బాయ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి దిగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్సిల్ పొరపాటున రాంగ్ అడ్రస్‌కు లేదా తప్పుగా తీసుకువచ్చాడనే నెపంతో సదరు హీరో ,అతని కుటుంబ సభ్యులు తనపై దౌర్జన్యానికి దిగారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విజువల్స్ నెటిజన్లను తీవ్ర కలకలానికి గురిచేస్తున్నాయి.
బాధితుడైన డెలివరీ బాయ్ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వీడియో రికార్డ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నాడు. తాను పొరపాటున వేరే ఆర్డర్ లేదా రాంగ్ అడ్రస్‌కు వచ్చినందుకు సదరు హీరోకు, వారి కుటుంబానికి అక్కడికక్కడే క్షమాపణలు చెప్పానని, అయినప్పటికీ వారు శాంతించకుండా తనపై భౌతిక దాడికి దిగారని పేర్కొన్నాడు. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న సమయంలో హీరో అఖిల్ రాజ్ ఆగ్రహంతో అతని వైపు దూసుకురావడం, కొట్టడానికి ప్రయత్నించడం వంటి దృశ్యాలు ఆ డెలివరీ బాయ్ తీసిన ఫోన్ వీడియోలో రికార్డ్ అయ్యాయి. అక్కడ ఉన్న ఇతరులు వారించే ప్రయత్నం చేసినా హీరో మాత్రం కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు.
ఈ గొడవలో హీరో అఖిల్ రాజ్ కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారింది. సదరు హీరో తల్లి తన ముఖంపై ఉమ్మివేసిందని, తనను తీవ్రంగా అవమానించిందని డెలివరీ బాయ్ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. ‘‘నేను తప్పు జరిగిందని సారీ చెప్పినా కూడా నన్ను ఇలా కొట్టడానికి ఎలా వస్తారు?’’ అంటూ అతడు ప్రశ్నించడం అందరినీ ఆలోచింపజేస్తోంది. మరోవైపు, ఈ ఘటన జరుగుతున్న సమయంలో అఖిల్ రాజ్ తండ్రి అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు హీరో మాత్రం డెలివరీ బాయ్‌పై ఒత్తిడి తెస్తూ, రికార్డ్ చేసిన వీడియోను తక్షణమే డిలీట్ చేయాలంటూ గద్దించడం వీడియోలో స్పష్టంగా వినబడుతోంది.
Also Read : మైనంపల్లి హన్మంతరావుకు బిగ్‌షాక్..అనుచరుడిపై పోక్సో కేసు
ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వేదికగా జరిగిన ఈ ఘోర పరాభవంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో కాస్త గుర్తింపు రాగానే డెలివరీ బాయ్ లాంటి కష్టజీవులపై ఇంత ఓవరాక్షన్,అహంకారం చూపించడం ఏంటని పలువురు నెటిజన్లు అఖిల్ రాజ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తప్పు ఎవరిదైనా సరే చట్టప్రకారంగా చూసుకోవాలి కానీ, ఇలా సామాన్యులపై భౌతిక దాడులు చేయడం సరికాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఒకవైపు వాదన (డెలివరీ బాయ్ వెర్షన్) మాత్రమే బయటకు వచ్చినందున, అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపై హీరో అఖిల్ రాజ్ లేదా అతని కుటుంబం స్పందిస్తే కానీ పూర్తి నిజాలు తెలియవు.
వివాదంలో చిక్కుకున్న నటుడు అఖిల్ రాజ్ నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం గతేడాది నవంబర్ 21న చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ప్రతిష్టాత్మక ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ – 2025’ లో ఉత్తమ చిత్రంగా అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన అఖిల్ రాజ్, కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం అఖిల్ రాజ్, ప్రముఖ దర్శకుడు సతీష్ గోగాడ దర్శకత్వంలో ‘అర్జునుడి గీతోపదేశం’ అనే సరికొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుకుంటోంది. ఇలాంటి కీలకమైన సమయంలో హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్‌పై దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడం, అతని రాబోయే చిత్రాలపై,వ్యక్తిగత ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా లేదా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : SIR జాబితాలో తన పేరు లేదని భయంతో వ్యక్తి ఆత్మహత్య!









