
SIR : ఓటరు సవరణ జాబితా చుట్టూ ముసురుకున్న అపోహలు, ఆందోళనలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. జాబితాలో నా పేరు లేదు.. ఇక నన్ను జైలుకు పంపుతారు. నా పిల్లల గతేంటి? అనే తీవ్ర భయాందోళనతో ఓ కారు డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. బోరబండ భరత్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపడమే కాకుండా, ఎస్ఐఆర్ జాబితాపై ప్రజల్లో ఉన్న అనుమానాలపై సరికొత్త చర్చకు దారితీసింది.
Also Read : బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు.. మూసీలేసి తొక్కుతా: సీఎం రేవంత్ రెడ్డి..!
SIR List Hyderabad
పోలీసుల కథనం ప్రకారం.. భరత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓటరు సవరణ జాబితాలో తన పేరు లేదని గమనించిన ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పేరు లేకపోతే అధికారులు తనను జైలుకు పంపుతారేమోనని భయపడిపోయారు. నన్ను జైలుకు పంపితే.. మన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారు? అంటూ భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య ఎంత నచ్చజెప్పినా, ధైర్యం చెప్పినా ఆయన మనస్తాపం తగ్గలేదు. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిజంగానే ముజీబుర్ రహ్మాన్ పేరు ఓటరు సవరణ జాబితాలో లేదా? ఒకవేళ లేకపోతే దానికి గల సాంకేతిక కారణాలు ఏంటి? కేవలం జైలుకు వెళ్తాడనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేక దీని వెనుక మరేదైనా ఆర్థిక, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసి, అన్ని కోణాల్లో కేసును విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : ‘వన్‌గ్రామ్’ బంగారు బాబులు.. ఆర్భాటాల వెనుక అసలు బండారం!









