
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కడప జిల్లా పులివెందులలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 40 వార్డులకు గానూ 30 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ 25 వార్డుల్లో విజయం సాధించగా, వైసీపీ -2, బీజేపీ 2, జనసేన -1 ఒక స్థానంలో విజయం సాధించాయి.
Also Read : మున్సిపల్ ఎన్నికల్లో వాసిరెడ్డి పద్మ కుమార్తె విక్టరీ!
మురసు తుపాను చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పడింది. దీంతో అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన సమయానికి కౌంటింగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబర్ 6వ తేదీకి ఓట్ల లెక్కింపును వాయిదా వేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే కౌంటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు, ఎన్నికల సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు నిరాశ ఎదురైంది. ఇప్పటికే పోలింగ్ పూర్తవడంతో గెలుపు ఎవరిదనే విషయంపై ఆయా పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే కౌంటింగ్ వాయిదా పడటంతో ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగనుంది.
కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపాలిటీని కూటమి కైవసం చేసుకుంది. మొత్తం 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ 19 వార్డులను గెలుచుకోగా, జనసేన పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 3 వార్డులను దక్కించుకున్నారు. ఈ ఫలితాలతో పెడన మున్సిపాలిటీలో కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించింది. మొత్తం 28 వార్డుల్లో 25 వార్డులను టీడీపీ, జనసేన కలిసి గెలుచుకోవడంతో మున్సిపల్ పీఠం కూటమి ఖాతాలో చేరింది. ఇక కూటమి చైర్పర్సన్ అభ్యర్థి నాగలింగ జ్యోత్స్నారాణి ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై ఏకంగా 4,380 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం నెలకొంది. మురసు తుపాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షం కురవడంతో ఓట్ల లెక్కింపునకు ఆటంకం ఏర్పడింది. ఉదయం 8 గంటలకే ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోకి వర్షపు నీరు చేరడంతో ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
Also Read : ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే









